సంక్షిప్త వార్తలు(8)

అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందినప్పుడు  వాతావరణంలోకి భారీగా హానికారక వాయువులు విడుదలవుతుంటాయి.

Updated : 08 Feb 2023 05:56 IST

అగ్నిపర్వతాలు వెదజల్లే హానికారక ఉద్గారాలు ఎక్కువే

వాషింగ్టన్‌: అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందినప్పుడు  వాతావరణంలోకి భారీగా హానికారక వాయువులు విడుదలవుతుంటాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడూ వీటిని ఎక్కువగానే వెదజల్లుతుంటాయని అమెరికాలోని వాషింగ్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు అంచనావేసిన దానికన్నా కనీసం మూడు రెట్లు ఎక్కువగా అగ్నిపర్వతాలు సల్ఫర్‌ను ఆర్కిటిక్‌ వాతావరణంలోకి వెలువరించినట్లు గుర్తించారు. గ్రీన్‌ల్యాండ్‌ ప్రాంతంలోని ఐస్‌ కోర్‌ను విశ్లేషించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. విస్ఫోట సమయంతో పోలిస్తే.. సాధారణ పరిస్థితుల్లో సల్ఫేట్‌ ఏరోసాల్స్‌ను 10 రెట్లు ఎక్కువగా వెలువరిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ రేణువులు సౌరశక్తిని అడ్డుకుంటాయి. తాజా పరిశోధన నేపథ్యంలో మానవ చర్యలు, అగ్నిపర్వతాల నుంచి వెలువడే రేణువుల సంఖ్యను సరిగా మదించాల్సి ఉంటుందని వివరించారు.


నగరాల్లో మరణాలకు చెట్ల అడ్డుకట్ట!

లండన్‌: అధిక ఉష్ణోగ్రతల కారణంగా నగరాల్లో సంభవించే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగల శక్తి చెట్లకు ఉందని పరిశోధకులు తెలిపారు. ఐరోపా ఖండంలోని 93 నగరాల్లో 2015లో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌కు చెందిన తామర్‌ లంగ్‌మాన్‌ నేతృత్వంలో పరిశోధకులు విస్తృత అధ్యయనాన్ని నిర్వహించారు. నగరాల్లో చెట్ల విస్తృతి 30% మేర పెరిగితే.. సగటున 0.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత తగ్గుతుందని వారు నిర్ధారించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా 93 ఐరోపా నగరాల్లో 2015లో 6,700 మరణాలు నమోదయ్యాయి. చెట్ల విస్తృతి 30% వరకు పెరిగి ఉంటే.. అందులో దాదాపు మూడో వంతు మరణాలు (2,644) సంభవించి ఉండేవి కావని పరిశోధకులు తేల్చారు.


క్వాంటమ్‌ రేణువుల జోరు

లండన్‌: క్వాంటమ్‌ పరిజ్ఞానం విషయంలో ఆస్ట్రియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. రెండు అయాన్ల మధ్య 230 మీటర్ల దూరం విజయవంతంగా బంధనం (ఎంటాంగిల్‌మెంట్‌) ఏర్పర్చగలిగారు. గతంలో ఒక ల్యాబ్‌ పరిధిలో కొద్దిమీటర్ల దూరం వరకూ మాత్రమే దీన్ని సాధించగలిగారు. ఇన్‌బ్రక్‌ వర్సిటీలో తాజా పరిశోధన జరిగింది. భవిష్యత్‌లో నగరాల వ్యాప్తంగా ఈ క్వాంటమ్‌ నెట్‌వర్క్‌ను విస్తరింపచేయడానికి ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. క్వాంటమ్‌ కంప్యూటర్లు, ఇతర క్వాంటమ్‌ టెక్నాలజీల నిర్మాణానికి ట్రాప్డ్‌ అయాన్లు కీలకం. ఆస్ట్రియా శాస్త్రవేత్తలు ఆప్టికల్‌ కావిటీల్లో అణువులను ట్రాప్‌ చేసే విధానాన్ని కొన్నేళ్ల కిందట అభివృద్ధి చేశారు. క్వాంటమ్‌ సమాచారాన్ని కాంతి రేణువుల ద్వారా సమర్థంగా చేరవేసేలా వీటిని రూపొందించారు. ఈ కాంతి రేణువులను ఆ తర్వాత ఆప్టికల్‌ ఫైబర్ల ద్వారా పంపి, అణువులను విభిన్న ప్రదేశాల్లో అనుసంధానించొచ్చు.


బ్రిటన్‌ సంచలన సీరియల్‌ రేప్‌ కేసుల్లో.. భారత సంతతి మహిళా జడ్జీ తీర్పు

లండన్‌: బ్రిటన్‌లో సంచలనం సృష్టించిన మహిళలపై జరిగిన సీరియల్‌ రేప్‌ కేసుల్లో మాజీ పోలీసు అధికారికి మంగళవారం భారత సంతతి మహిళా జడ్జీ 36 ఏళ్ల జీవిత ఖైదు శిక్షను విధించారు. స్కాట్‌లాండ్‌కు చెందిన పోలీసు అధికారి డెవిడ్‌ కార్రిక్‌ 17 ఏళ్ల తన అధికారంలో 12మంది మహిళలపై హింస, క్రూరమైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వీటికి సంబంధించి 49 నేర అభియోగాలు అతనిపై ఉన్నాయి. ఓ మహిళ ఫిర్యాదుతో అతని అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. లండన్‌లోని సౌత్‌వార్క్‌ క్రౌన్‌ కోర్టు జడ్జీ జస్టిస్‌ పరమ్‌జిత్‌ కౌర్‌ తీర్పును ఇస్తూ.. ‘‘నేరస్థుడు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డాడు. 36 ఏళ్లు జీవిత ఖైదు విధించడమే కాకుండా 30 ఏళ్ల వరకు ఎలాంటి పేరోల్‌ అతనికి అందకూడదు. ధైర్యంగా వచ్చి నిందితుడిపై ఫిర్యాదు చేసిన మహిళను అభినందిస్తున్నాను’’ అని అన్నారు. భారత సంతతికి చెందిన హోంమంత్రి సువెల్లా బ్రేవర్‌మాన్‌ స్పందిస్తూ.. నిందితుడు పోలీసు బలగాలకే కళంకం తెచ్చాడని వ్యాఖ్యానించారు.


అమెరికా వాయు స్థావరంలోకి ఆగంతుకుడి చొరబాటు.. కాల్పులు

వాషింగ్టన్‌: అమెరికా సైనిక స్థావరాల్లో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటైన.. అధ్యక్షుడి విమానాల సముదాయం ఉండే జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లోకి ఓ ఆగంతుకుడు చొరబడ్డాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన భద్రతా సిబ్బంది ఒకరు ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన వెంటనే అక్కడికి చేరుకొన్న భద్రతా దళాలు చొరబాటుదారును అదుపులోకి తీసుకొన్నాయి. సోమవారం జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా లోపాలను ఆరా తీస్తున్నారు. జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో అధ్యక్షుడి పర్యటనలకు వాడే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌, మెరైన్‌ వన్‌, అవసర సమయాల్లో అణు నిర్దేశక, నియంత్రణ కేంద్రంగా పనిచేసే ‘డూమ్స్‌డే’ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌  ఉంటాయి. గతంలో 2021 ఫిబ్రవరిలోనూ ఇలాంటి చొరబాటే జరిగింది.


పెషావర్‌ మసీదుపై ఆత్మాహుతి దాడికి.. అఫ్గాన్‌ నుంచే కుట్ర : పాక్‌ వెల్లడి

పెషావర్‌: పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్సు రాజధాని పెషావర్‌లో ఇటీవల ఓ మసీదుపై జరిగిన భీకర ఆత్మాహుతి దాడికి అఫ్గానిస్థాన్‌ నుంచే కుట్ర పన్నినట్లు పాక్‌ అధికారులు మంగళవారం వెల్లడించారు. పొరుగు దేశానికి చెందిన గూఢచార సంస్థ ఈ దాడికి నిధులు సమకూర్చినట్లు తెలిపారు.పెషావర్‌ మసీదులో జనవరి 30వ తేదీ మధ్యాహ్నం ప్రార్థనల సందర్భంగా జరిగిన తాలిబన్‌ ఆత్మాహుతి దాడిలో 101 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. అత్యంత భద్రత కలిగిన ఆ ప్రాంతంలోకి చొరబడేందుకు దుండగుడు పోలీసు దుస్తుల్లో.. తలకు హెల్మెట్‌, మాస్కుతో ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటిదాకా 17 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి పెషావర్‌ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.


యుద్ధ సన్నద్ధతను బలోపేతం చేయండి
సైన్యానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదేశం

సోల్‌: యుద్ధ సన్నద్ధతను బలోపేతం చేయడమే కాకుండా విన్యాసాలను నిర్వహించాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సైన్యాధికారులను ఆదేశించారు. సోమవారం అధికార వర్కర్స్‌ పార్టీ సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో బుధవారం జరగబోయే ‘కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ’ 75వ వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా ఈ భేటీ నిర్వహించారు. విజయవంతమైన విన్యాసాలు నిర్వహించేందుకు, సాటి లేని సైనిక బలాన్ని నిరూపించేందుకు సైనిక బలగాలను ప్రోత్సహించాలని కిమ్‌ ఆదేశించారు. యుద్ధానికి సన్నద్ధత వంటి అంశాల్లో ఉత్తర కొరియా మిలిటరీలో పెను మార్పులు వచ్చాయని కమిషన్‌ వెల్లడించింది. దక్షిణ కొరియాలో సైనిక కసరత్తులను విస్తరిస్తున్న అమెరికాకు హెచ్చరికలా ఈ సమావేశాన్ని కిమ్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది.


పాక్‌లో వికీపీడియా సేవల పునరుద్ధరణ

ఇస్లామాబాద్‌: ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ దైవదూషణ చేస్తోందంటూ రెండు రోజుల క్రితం వికీపీడియా సేవలను నిలిపివేసిన పాకిస్థాన్‌ ప్రభుత్వం.. తాజాగా వెనక్కు తగ్గింది. ఆ సేవలను మంగళవారం పునరుద్ధరించింది. ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా వికీపీడియాలో ఆ సంస్థ సమాచారం పెట్టిందని ఆరోపిస్తూ పాకిస్థాన్‌ టెలీ కమ్యూనికేషన్‌ అథారిటీ(పీటీఏ).. 48 గంటల్లో ఆ సమాచారాన్ని తొలగించాలని ఆదేశించింది. వికీపీడియా(వికీమీడియా సంస్థ) దాన్ని అంగీకరించకపోవడంతో సేవలను నిలిపివేసింది. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవడానికి ముగ్గురు మంత్రుల కమిటీని పాక్‌ ప్రభుత్వం నియమించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని