స్తంభించిన జర్మనీ.. వేతనాలు పెంచాలంటూ కార్మిక సంఘాల సమ్మె

ఐరోపాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జర్మనీలో సోమవారం ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా.

Published : 28 Mar 2023 05:04 IST

బెర్లిన్‌: ఐరోపాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జర్మనీలో సోమవారం ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు ఒక రోజు సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా విమానాలు, రైళ్లు, బస్సులు, ఫెర్రీలు, ట్రామ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జర్మనీ చరిత్రలో 1992 తర్వాత ఇదే అతిపెద్ద సమ్మె అని స్థానిక మీడియా పేర్కొంది. పోర్టులు, రైళ్లు, విమానాల నుంచి కార్గో సేవలు కూడా నిలిచిపోయాయి. 5 శాతం వేతనం పెంచుతామని యాజమాన్యాలు ప్రతిపాదించగా.. 10.5% పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని కార్మిక సంఘం నాయకుడు ఉల్రిచ్‌ తెలిపారు. తదుపరి చర్చల్లో యాజమాన్యాలు తమ డిమాండ్లను పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. తమ వేతనాల్లో దారుణమైన నష్టాలను చవిచూశామని.. వాటిని సరిచేయాలని కార్మిక నాయకులు కోరారు. దేశంలో పెద్ద నగరాల్లో నివసిస్తున్న కార్మికుల ఇంటి అద్దె ఖర్చులు భారీగా అవుతున్నాయని.. వారిని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పారు. మరో కార్మిక నాయకుడు మాట్లాడుతూ.. రైళ్లలో పనిచేసే మేనేజర్ల జీతాలతో పోలిస్తే తమవి చాలా తక్కువని ఆవేదన వ్యక్తం చేశారు. రైళ్లు స్తంభించిపోవడం వల్ల సరకు రవాణాకు ఆటంకం కలిగింది. టికెట్‌ కొన్న ప్రయాణికులు ఆందోళన చెందవద్దని.. అవి తర్వాత కూడా చెల్లుబాటు అవుతాయని రైల్వే శాఖ తెలిపింది. కార్మికులు, ప్రభుత్వం ఇరు పక్షాలు మధ్య మూడు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి నాన్సీ ఫేజర్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు