బ్రిటన్‌ ధనవంతుల జాబితాలో.. 53 స్థానాలు కోల్పోయిన ప్రధాని సునాక్‌ దంపతులు

బ్రిటన్‌ ధనవంతుల జాబితాలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి దంపతులు... నిరుటితో పోలిస్తే 53 స్థానాలు కిందికి దిగజారారు.

Updated : 20 May 2023 05:46 IST

లండన్‌: బ్రిటన్‌ ధనవంతుల జాబితాలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి దంపతులు... నిరుటితో పోలిస్తే 53 స్థానాలు కిందికి దిగజారారు. ఇన్ఫోసిస్‌లో అక్షత షేర్ల విలువ తగ్గిపోవడంతో వారి ఆస్తిలో రూ.2,069 కోట్లు కోల్పోవడమే ఇందుకు కారణమని ‘‘ది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌-2023’’ శుక్రవారం ప్రకటించింది. నిరుటి జాబితాలో రూ.7,104 కోట్లతో 275వ స్థానంలో ఉన్న రిషి, అక్షత దంపతులు ఈ ఏడాది రూ.5,448 కోట్లతో 222వ స్థానానికి పడిపోయారు. ఈ జాబితాలో ఎప్పటిలాగానే హిందూజా సోదరులు తొలిస్థానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాది వారి ఆదాయం భారీగా పెరగడంతో ఆస్తి మొత్తం ఏకంగా రూ.36.04 లక్షల కోట్లకు చేరింది. ఈ జాబితాలో భారత మూలాలున్న డేవిడ్‌, సైమన్‌ రూబెన్‌ సోదరులు రూ.25.11 లక్షల కోట్లతో 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రవాస భారతీయుడు లక్ష్మీమిత్తల్‌ రూ.16.46 లక్షల కోట్ల ఆస్తితో 6వ స్థానంలో నిలిచారు. వేదాంత రిసోర్సెస్‌ అధిపతి అనిల్‌ అగర్వాల్‌ రూ.8.27 లక్షల కోట్లతో 22వ స్థానం దక్కించుకున్నారు. వీరితో పాటు వస్త్ర వ్యాపారి ప్రకాశ్‌ లోహియా (33వ స్థానం), రిటైల్‌ వ్యాపారి మొహిసిన్‌-జుబెర్‌ ఇస్సా(40), ఫార్మా దిగ్గజాలు నవీన్‌ ఇంజినీర్‌-వర్ష ఇంజినీర్‌(61), లార్డ్‌ స్వరాజ్‌పాల్‌ కుటుంబం(68), సైమన్‌, బాబీ, రాబిన్‌ అరోడాల కుటుంబం(71) సైతం ఈ జాబితాలో ఉన్నారు. ఫ్యాషన్‌ వ్యాపారి సుందర్‌ జెనోమల్‌(78), హోటళ్ల వ్యాపారంలో ఉన్న జస్మిందర్‌సింగ్‌ కుటుంబం(89) తొలిసారి చోటు దక్కించుకున్నారు. బ్రిటన్‌ రాజు హోదాలో తొలిసారి కింగ్‌ ఛార్లెస్‌-3 రూ.6,176 కోట్ల ఆస్తితో ధనవంతుల జాబితాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని