కఖోవ్కా డ్యాంను సందర్శించిన జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌లో జరిగిన నోవా కఖోవ్కా డ్యాం ప్రమాదం వల్ల ఇప్పటి వరకు అయిదుగురు మరణించారని రష్యా నియమించిన నోవా కఖోవ్కా మేయర్‌ లెంటీవ్‌ గురువారం తెలిపారు.

Published : 09 Jun 2023 05:29 IST

ప్రమాదంలో అయిదుగురి మృతి

ఖేర్సన్‌, బ్రసెల్స్‌: ఉక్రెయిన్‌లో జరిగిన నోవా కఖోవ్కా డ్యాం ప్రమాదం వల్ల ఇప్పటి వరకు అయిదుగురు మరణించారని రష్యా నియమించిన నోవా కఖోవ్కా మేయర్‌ లెంటీవ్‌ గురువారం తెలిపారు. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీని కనుగొన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్‌ అధీనంలో ఉన్న డ్యాం పశ్చిమ భాగాన్ని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సందర్శించారు. అక్కడి ప్రజలకు అందుతున్న సహాయాన్ని పరిశీలించానని, ఈ ప్రమాదం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేశానని ఆయన పేర్కొన్నారు. బాధితులకు నష్టపరిహారం అందించే అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. గురువారం ఉదయానికి డ్యాం చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచి ఉందని, 600 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పూర్తిగా మునిగిపోయిందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఈ విపత్తు వల్ల సుమారు 60 వేల మంది తమ నివాసాల నుంచి తరలిపోయారన్నారు. ఈ ఘటనపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ స్పందించారు. ఇది ఘోరమైన దాడి అని ట్వీట్‌ చేశారు. తక్షణమే ఉక్రెయిన్‌ ప్రజలకు 5 లక్షల నీటిశుద్ధి మాత్రలు, యంత్రాలు, కిట్లను పంపిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌ సైన్యమే కఖోవ్కా డ్యాంపై దాడికి పాల్పడిందని రష్యా మిత్ర దేశం బెలారస్‌ ఆరోపించింది.

* ఆనకట్ట తెగిపోయినందున నీట మునిగిన నగరంపై రష్యా బలగాలు గురువారం దాడులకు తెగబడ్డాయని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. దీంతో సహాయ కార్యక్రమాలను కొన్ని గంటలపాటు నిలిపివేయాల్సి వచ్చిందని, అధ్యక్షుడు జెలెన్‌స్కీ వచ్చి వెళ్లాక ఈ దాడులు జరిగాయని వివరించారు. దాడుల కారణంగా ఎనిమిది మంది గాయపడినట్లు చెప్పారు.

* పోలండ్‌ తీసుకొచ్చిన వివాదాస్పద చట్టానికి సంబంధించి ఐరోపా సమాఖ్య (ఈయూ) గురువారం చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. రష్యా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకే ఈ చట్టం అంటూ పోలండ్‌లోని జాతీయవాద ప్రభుత్వం చెబుతుండగా, విపక్షాలను పీడించేందుకు ఉద్దేశించిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన ఈయూ ‘‘కొత్త చట్టం ప్రజాస్వామ్య ప్రక్రియల్లో అనవసర జోక్యాలకు ఆస్కారం ఇస్తుంది. ప్రజాస్వామ్య సూత్రాలను, సమర్థమైన న్యాయ రక్షణ హక్కులను ఉల్లంఘిస్తుంది’’ అని విమర్శించింది. ఈ మేరకు పోలండ్‌కు నోటీసు జారీచేసిన ఈయూ, అందులో పేర్కొన్న అంశాలపై 21 రోజుల్లో సమాధానం తెలియజేయాలని కోరింది. ఆ తర్వాత ఈయూ నిబంధనల ప్రకారం వ్యవహరించనట్లు తేలితే భారీ జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.

క్రిమియా కేసును కొట్టేయండి: రష్యా

క్రిమియా స్వాధీన ప్రక్రియపై తమపై ఉక్రెయిన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) రష్యా సూచించింది. ఆ ఆరోపణలకు ఎలాంటి చట్టబద్ధత లేదని, కనీసం ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలూ వారి వద్ద లేవని నెదర్లాండ్స్‌లో రష్యా రాయబారి ఐసీజేకు వెల్లడించారు. మరోవైపు, ఐసీజేలో విచారణ ప్రారంభం కాగానే రష్యా తన దుష్ప్రచారాన్ని ప్రారంభించిందని ఉక్రెయిన్‌ ప్రతినిధులు వాదించారు. ఈ కేసులో వాదనలు మరో వారంలో ముగియనుండగా.. తీర్పు వెలువడడానికి మరికొన్ని నెలలు పట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని