Europe: వలసలతో ఐరోపా విలవిల

వీటన్నింటి మూలాల్లోకి వెళితే కారణాలు వలసల్లో కనిపిస్తున్నాయి. కల్లోల దేశాల నుంచి పారిపోయి వచ్చిన వారికి మానవతా దృక్పథంతో తలుపులు తెరిచిన ఐరోపాలోని అనేక దేశాలు నేడు ఊహించని సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

Updated : 09 Jul 2023 08:23 IST

ఫ్రాన్స్‌తోపాటు చాలా దేశాల్లో ఇదే సమస్య
ఆయా దేశాల రాజకీయాలూ ప్రభావితం
ఈనాడు ప్రత్యేక విభాగం

ఫ్రాన్స్‌ అల్లర్లతో అట్టుడుకుతోంది...

నెదర్లాండ్స్‌లో ప్రభుత్వం కుప్పకూలింది...

స్వీడన్‌లో ముఠా ఘర్షణల్లేకుండా రాత్రి గడవటం లేదు...

ప్రశాంత స్విట్జర్లాండులోనూ రోజూ గొడవలు తప్పట్లేదు...

బెల్జియం, జర్మనీల్లో అల్లర్లు, నేరాలు పెరిగిపోయాయి....

వీటన్నింటి మూలాల్లోకి వెళితే కారణాలు వలసల్లో కనిపిస్తున్నాయి. కల్లోల దేశాల నుంచి పారిపోయి వచ్చిన వారికి మానవతా దృక్పథంతో తలుపులు తెరిచిన ఐరోపాలోని అనేక దేశాలు నేడు ఊహించని సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లోని రాజకీయాలే ప్రభావితమై, ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి తలెత్తుతోంది. యుద్ధాలు, అంతర్యుద్ధాల్లో చిక్కుకున్న యుగొస్లావియా, ఉక్రెయిన్‌, సిరియా, అఫ్గానిస్థాన్‌లలో బాధితులు తక్షణ ఆశ్రయం కోసం ఐరోపా దేశాల వైపు చూస్తున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని, ఉన్నదేశంలో అన్నీ వదులుకొని లక్షల కుటుంబాలు చట్టబద్ధంగానో, విరుద్ధంగానో సరిహద్దులు దాటాయి. సముద్రాలపై పడవల్లో ప్రమాదకర ప్రయాణాలు చేసి ఐరోపా దేశాల తలుపుతట్టాయి. ఈ క్రమంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

2015లో వలస సునామీ

లక్షల్లో వలసదారులు వెల్లువెత్తుతుండటంతో అనేక ఐరోపా దేశాలు తొలుత తటపటాయించాయి. చివరికి మానవతా దృక్పథంతో జర్మనీ వంటి కొన్ని దేశాలు వారికి ఆశ్రయం కల్పించటానికి నిర్ణయించాయి. పోలండ్‌, హంగరీలాంటి దేశాలు మాత్రం తలుపులు మూసేశాయి. ఈ అంశంపై కఠినంగా ఉండాలని వాదిస్తున్నాయి. 2007- 2011 మధ్య భారీసంఖ్యలో పశ్చిమాసియా, ఆఫ్రికా, దక్షిణాసియాల నుంచి ఐరోపాలోకి వలసలు సాగాయి. అరబ్‌ విప్లవం తర్వాత టునీసియా, లిబియా, ఈజిప్టు, యెమెన్‌, అల్జీరియాల నుంచి ఇంకా పెరిగాయి. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, సోమాలియా, సూడాన్‌, నైజీరియాల్లో యుద్ధాలకు సిరియా అంతర్యుద్ధం తోడయింది.

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాదుల రంగప్రవేశంతో పరిస్థితి క్షీణించి భారీసంఖ్యలో ప్రజలు వలసకు మొగ్గుచూపారు. ఇదే అదనుగా అక్రమ రవాణా వ్యాపారంగా మారింది. బాధితులతో పాటు... సంఘవ్యతిరేక శక్తులు సైతం వలసబాట పట్టాయి. 2015లో దాదాపు 15 లక్షల మంది చట్టవిరుద్ధంగా గ్రీస్‌, బల్గేరియా, ఇటలీ, స్పెయిన్‌, మాల్టా, సైప్రస్‌ల ద్వారా ఐరోపా దేశాల్లోకి వచ్చారని అంచనా. ఒక్క గ్రీస్‌ ద్వారానే 8లక్షలకుపైగా మంది ప్రవేశించినట్లు తేల్చారు. 2015ను వలస ఏడాదిగా అభివర్ణించారు. ఆ తర్వాతి నుంచి ఏటా లక్షల్లో వలస వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గ్రీసు, ఇటలీల నుంచి ఎక్కువ సంఖ్యలో వలసలు వస్తుండటంతో వారిని ఇతరదేశాల్లోకి పంపించేలా ఐరోపా సంఘం నిర్ణయించింది.

ఘర్షణలు, నేరాలు పెరిగాయి...

కాలక్రమంలో ఈ వలసల ప్రభావం ఐరోపా ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలపై పడటం ఆరంభమైంది. శరణార్థులకు నివాస, ఉపాధి అవకాశాలు కల్పించటం, వారు స్థానిక సంస్కృతులతో మిళితం చేయడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. క్రమంగా వలస కుటుంబాల జనాభాతోపాటు వారి గళం కూడా పెరిగింది. ఉదాహరణకు.. ఇప్పుడు అల్లర్లు ఎదుర్కొంటున్న ఫ్రాన్స్‌లోనే శరణార్థుల జనాభా 10శాతానికి చేరింది. సరైన ఉపాధి అవకాశాలు లేకపోవటంతో ఘర్షణ మొదలైంది. నేరాలు పెరిగాయి. ఒకప్పుడు ప్రశాంతతకు పేరొందిన స్వీడన్‌లో ముఠా ఘర్షణలు లేని రాత్రి ఉండటం లేదు. నార్వేలోనూ కాల్పులు సర్వసాధారణమైపోయాయి. 2022లో ఐరోపాలోకి చట్టవిరుద్ధంగా వచ్చినవారి సంఖ్య 3.5 లక్షలుగా అంచనా. వీరిలో సిరియా, అఫ్గ్గానిస్థాన్‌, టునీషియాల నుంచే 50% మంది వచ్చారు.


కుప్పకూలిన నెదర్లాండ్స్‌ ప్రభుత్వం

శరణార్థుల సమస్యే కారణం

హేగ్‌: వలసల సమస్య నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రుటె పదవికి ఎసరుతెచ్చింది. ఈ అంశంపై సంకీర్ణ కూటమిలో చెలరేగిన విభేదాలతో ఆయన రాజీనామా చేశారు. అధికార పక్షంలోని నాలుగు పార్టీల మధ్య ఉన్న సైద్ధాంతిక వైరుధ్యాలను ఈ వివాదం కళ్లకు కట్టింది. కొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ వలస అంశమే ప్రచారాస్త్రంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.  కొన్నేళ్లుగా ఐరోపాలో ఇది పెను వివాదంగా మారింది.

శనివారం రాజు విల్లెమ్‌ అలెగ్జాండర్‌ను కలిసిన మార్క్‌ రుటె.. తన రాజీనామా లేఖను అందజేశారు. ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన రాజకీయ సంక్షోభం గురించి ఆయనకు వివరించారు. కుటుంబంతో కలిసి గ్రీస్‌లో విహారయాత్రలో ఉన్న రాజు తాజా పరిస్థితుల నేపథ్యంలో హుటాహుటిన స్వదేశానికి తిరిగొచ్చారు. కొత్త సంకీర్ణం ఏర్పడేవరకూ మార్క్‌.. ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.

నెదర్లాండ్స్‌ను సుదీర్ఘంగా పాలించిన మార్క్‌.. రాజకీయంగా అత్యంత అనుభవజ్ఞుడు. 2010లో ఆయన తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది జనవరిలో ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అయితే వలసలను నియంత్రించే విధానంపై అంగీకారం కుదరకపోవడంతో 18 నెలల్లోనే గద్దె దిగాల్సి వచ్చింది. దేశంలోని శరణార్థి శిబిరాలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఆ సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారం చూపుతానని మార్క్‌ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో యుద్ధ ప్రాంతాల నుండి వచ్చే శరణార్థుల బంధువుల సంఖ్యను పరిమితం చేస్తానంటూ ఆయన ప్రతిపాదించడంతో అధికార కూటమిలో సంక్షోభం తలెత్తింది. దీనిని కూటమిలోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది ప్రధాని రాజీనామాకు దారితీసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని