Imran Khan: జైల్లో ఉండలేను.. ఇక్కడి నుంచి తీసుకెళ్లండి

తోషాఖానా కేసులో దోషిగా నిరూపితమై అటక్‌ జైలులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌.. కారాగారంలోని వసతులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Updated : 10 Aug 2023 08:18 IST

న్యాయవాదులకు ఇమ్రాన్‌ మొర

ఇస్లామాబాద్‌: తోషాఖానా కేసులో దోషిగా నిరూపితమై అటక్‌ జైలులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌.. కారాగారంలోని వసతులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడో తరగతి ఖైదీలను ఉంచే గదిలో తనను ఉంచారని, పురుగులు ఇబ్బంది పెడుతున్నాయని తనను కలవడానికి వచ్చిన న్యాయవాది నయీమ్‌ హైదర్‌కు ఇమ్రాన్‌ తెలిపారు. ఎలాగైనా ఇక్కడి నుంచి తనను బయటికి తీసుకెళ్లాలని ఇమ్రాన్‌ తెలిపినట్లు పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ (పీటీఐ) వర్గాలు తెలిపాయి. అటక్‌ జైలు నుంచి తమ నాయకుడిని సౌకర్యాలు మెరుగ్గా ఉండే అదియాల్‌ జైలుకు తరలించమని పీటీఐ ఇప్పటికే ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఇమ్రాన్‌ న్యాయవాదుల బృందం కూడా జైల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేసింది. దారుణమైన పరిస్థితుల మధ్య ఆయనను బందీగా ఉంచారని తెలిపింది. అయితే ఇమ్రాన్‌ మానసిక స్థైర్యం కోల్పోలేదని.. ఎన్నేళ్లు తనను జైలులో ఉంచినా.. ఉండటానికి సిద్ధమని తెలిపారని పేర్కొంది. మరోవైపు తన శిక్షను సస్పెండ్‌ చేయాలంటూ ఇమ్రాన్‌ వేసిన పిటిషన్‌పై తక్షణ ఊరట ఇచ్చేందుకు ఇస్లామాబాద్‌ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసుపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.


వేలంలో తోషాఖానా బహుమతులు

తోషాఖానాలోని బహుమతులను వేలం వేసి అనాథల కోసం ఖర్చుపెట్టాలని షెహబాజ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసులోనే మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. వేలం వేయగా వచ్చిన నిధులను.. పేదలు, నిస్సహాయుల కోసం వినియోగిస్తామని షెహబాజ్‌ వెల్లడించినట్లు పాక్‌ పత్రికలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని