Artificial intelligence: విద్యుత్తు వినియోగాన్ని అమాంతం పెంచే ఏఐ

కృత్రిమ మేధా (ఏఐ) సాధనాల శిక్షణకు, వాటి వినియోగానికి వెచ్చించాల్సిన విద్యుచ్ఛక్తి పరిమాణం 2027కల్లా నెదర్లాండ్స్‌, స్వీడన్‌, అర్జెంటీనా వంటి చిన్న దేశాల వార్షిక విద్యుత్‌ వినియోగాన్ని మించిపోనుంది.

Updated : 12 Oct 2023 06:28 IST

2027 కల్లా ఏడాదికి 134 టెరావాట్‌ కరెంటు అవసరం

దిల్లీ: కృత్రిమ మేధా (ఏఐ) సాధనాల శిక్షణకు, వాటి వినియోగానికి వెచ్చించాల్సిన విద్యుచ్ఛక్తి పరిమాణం 2027కల్లా నెదర్లాండ్స్‌, స్వీడన్‌, అర్జెంటీనా వంటి చిన్న దేశాల వార్షిక విద్యుత్‌ వినియోగాన్ని మించిపోనుంది. నెదర్లాండ్స్‌లోని వరైయా విశ్వవిద్యాలయ పరిశోధకుడు అలెక్స్‌ డె వ్రీస్‌ అంచనా ఇది. ఏఐ సాధనాలు అపార సమాచార రాశిని ఆపోశన పట్టి మన ప్రశ్నలకు సమాధానాలిస్తాయి, లిఖిత, వీడియో సందేశాలూ పంపుతాయి. వాటికి విస్తృత సమాచార రాశి వినియోగంపై శిక్షణ ఇవ్వడానికి ఎంతో విద్యుత్తును వినియోగించాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక మన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ప్రతిసారీ కరెంటు ఖర్చవుతుంది. ఏతావతా 2027 కల్లా ప్రపంచమంతటా ఏఐ కోసం విద్యుత్‌ వినియోగం ఏడాదికి 85 నుంచి 134 టెరావాట్‌ అవర్లకు చేరుతుందని డెవ్రీస్‌ అంచనా వేశారు. ఒక టెరావాట్‌ అవర్‌ 1,000 గిగావాట్‌ అవర్లకు సమానం. ఒక గిగావాట్‌ 1000 మెగావాట్‌ అవర్లకు సమానం. 

ఏఐ సాధనం చాట్‌ జీపీటీని ఒక రోజు వాడటానికి 564 మెగావాట్‌ అవర్ల విద్యుత్‌ ఖర్చవుతుంది. రోజుకు 900 కోట్ల శోధనలకు (సెర్చి) సమాధానమిచ్చే గూగుల్‌, ఆ పనికి ఏఐని వినియోగిస్తే ఏటా 30 టెరావాట్‌ అవర్ల విద్యుత్తును వెచ్చించాల్సి ఉంటుంది. అది ఐర్లాండ్‌ దేశ వార్షిక విద్యుత్‌ వినియోగానికి సమానం. లిఖిత సందేశాలను పంపే ఏఐ సాధనానికి శిక్షణ ఇవ్వడానికి తాను 433 మెగావాట్‌ అవర్ల విద్యుత్తును ఉపయోగించాననీ, అది 40 అమెరికన్‌ కుటుంబాల వార్షిక విద్యుత్‌ వినియోగానికి సమానమని న్యూయార్క్‌కు చెందిన ఓ కంపెనీ తెలిపినట్లు డెవ్రీస్‌ వివరించారు. ప్రపంచమంతటా ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ విద్యుచ్ఛక్తికి గిరాకీ అపారంగా పెరిగిపోతుందని, అవసరమైన పనులకే ఏఐని వినియోగించడం మంచిదని డెవ్రీస్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని