మైగ్రేన్‌ బాధితుల దృష్టి సంబంధ ఇబ్బందులకు కారణమిదే..!

మైగ్రేన్‌తో బాధపడుతున్న కొందరిలో దృష్టి సంబంధ లక్షణాలు ఉత్పన్నమవుతుంటాయి. దీనికి కారణాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. రెటీనాలోని రక్త ప్రవాహ తీరులో మార్పులే ఇలాంటి పరిస్థితికి దారితీస్తున్నట్లు తేల్చారు.

Published : 11 Jan 2024 05:31 IST

దిల్లీ: మైగ్రేన్‌తో బాధపడుతున్న కొందరిలో దృష్టి సంబంధ లక్షణాలు ఉత్పన్నమవుతుంటాయి. దీనికి కారణాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. రెటీనాలోని రక్త ప్రవాహ తీరులో మార్పులే ఇలాంటి పరిస్థితికి దారితీస్తున్నట్లు తేల్చారు. ఈ రుగ్మతను సులువుగా గుర్తించడానికి, చికిత్స చేయడానికి ఈ ఆవిష్కారం వైద్యులకు దోహదపడుతుందని వారు వివరించారు. రెటీనా అనేది కంట్లో చాలా ముఖ్య భాగం. ఇది.. కాంతికి స్పందించే కణజాల పొర. మైగ్రేన్‌ బాధితుల్లో తరచూ కంటి చుట్టూ నొప్పి, కాంతిని చూడగానే కళ్లలో మంట, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇందుకు దారితీసే అంశాలపై శాస్త్రవేత్తలకు సరైన అవగాహన లేదు. తాజాగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు.. ఆప్టికల్‌ కోహరెన్స్‌ టొమోగ్రఫీ యాంజియోగ్రఫీ (ఓక్టా) అనే నాన్‌-ఇన్‌వేజివ్‌ ఇమేజింగ్‌ విధానంతో ప్రయోగాలు నిర్వహించారు. దీనిద్వారా మైగ్రేన్‌ బాధితుల రెటీనాలోని రక్తనాళాల్లో వచ్చే మార్పులను పరిశీలించారు. మైగ్రేన్‌ విరుచుకుపడినప్పుడు, సాధారణ సమయంలోనూ ఈ పరిశీలనలు సాగాయి. ఈ రుగ్మత ఉన్న కొందరిలో కళ్ల ముందు మెరుపుల్లాంటి ఆకృతులు (ఆరా లక్షణాలు) కనిపిస్తుంటాయి. ఇలాంటిని పరిస్థితిని ఎదుర్కొనే 37 మంది మైగ్రేన్‌ బాధితులు, ఆ లక్షణం లేని మందిని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. మైగ్రేన్‌ విరుచుకుపడినప్పుడు రెటీనాలోకి రక్త ప్రవాహం తగ్గుతున్నట్లు గుర్తించారు. ఆరా లక్షణమున్న, లేని బాధితుల్లో ఇదే పోకడ కనిపించింది. అయితే ఆరా లక్షణాలు కలిగినవారిలో ప్రత్యేకించి రెటీనాలోని కొన్ని ప్రదేశాల్లో రక్తప్రవాహం తక్కువగా ఉంటున్నట్లు తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని