Hillary Clinton: బైడెన్‌ ‘వయసు’ ఓ సమస్యే.. కానీ!: హిల్లరీ క్లింటన్‌

బైడెన్‌ వయసును ఓ సమస్యగా భావిస్తున్నట్లు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ వ్యాఖ్యానించారు.

Published : 12 Feb 2024 02:08 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జ్ఞాపకశక్తి, వయసుపై తీవ్ర విమర్శలు వస్తోన్న వేళ.. అగ్రరాజ్య మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ (Hillary Clinton) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వయసును వాస్తవమైన సమస్యగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆందోళనకర అంశమేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్న తరుణంలో ఈ వ్యవహారం డెమోక్రాట్లకు తలనొప్పి వ్యవహారంగా మారింది.

ఈ సమస్య గురించి ‘వైట్ హౌస్‌’కూ తెలుసని హిల్లరీ క్లింటన్‌ చెప్పారు. ఆయనకన్నా మూడేళ్లు చిన్నవాడైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విషయంలోనూ ఈ సమస్య ఉందన్నారు. యువ ఓటర్లతో మమేకం కావడంలో ఈ ఇద్దరికీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే.. ఒక నేతగా బైడెన్‌ తన అనుభవాన్ని స్పష్టంగా చాటిచెప్పాలన్నారు. ‘‘వయసు ఒక సమస్య కావొచ్చు. కానీ, ఓటర్లు ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవడం ముఖ్యం. అధ్యక్షుడిగా బైడెన్‌ మరోసారి ఎన్నిక కావాలి. దేశాధినేతగా ఆయన మంచి పనులు చేశారు’’ అని హిల్లరీ పేర్కొన్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలిసిందే.

బైడెన్‌కు ఆ విషయాలూ గుర్తులేవు.. కీలక నివేదికలో సంచలన ఆరోపణలు!

‘‘81 ఏళ్ల బైడెన్‌ జ్ఞాపకశక్తి చాలా మసకగా ఉంది. జీవితంలోని కీలక సంఘటనలను సైతం గుర్తుకు తెచ్చుకోలేకపోయారు. కుమారుడు బ్యూ బైడెన్‌ ఎప్పుడు చనిపోయారనే విషయమూ జ్ఞాపకం లేదు. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదు’’ అని ఆయన్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ రాబర్ట్‌ హుర్‌ ఇటీవల ఓ నివేదికను విడుదల చేశారు. అయితే.. ఈ రిపోర్ట్‌ను దేశాధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. తన జ్ఞాపకశక్తిలో ఎలాంటి లోపాలు లేవని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడానికి తాను అత్యంత అర్హత కలిగిన వ్యక్తినని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని