Hong Kong: మోడల్‌ని ముక్కలుగా నరికి.. ఫ్రిజ్‌లో కాళ్లను దాచేసి!

హాంకాంగ్‌లో ఓ మోడల్‌ దారుణ హత్య కలకలం రేపుతోంది. నిందితులు ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి, కాళ్లను ఫ్రిజ్‌లో దాచేయడం గమనార్హం.

Published : 26 Feb 2023 22:57 IST

హాంకాంగ్‌: హాంకాంగ్‌(Hong Kong)లో ఓ మోడల్‌ దారుణ హత్య(Model Murder)కు గురైన సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి తైపో నగర శివారులో ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో ఆమె కాళ్లు లభ్యం కావడం కలకలం రేపింది. పక్కనే శరీరాన్ని ముక్కలు చేసే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 28 ఏళ్ల అబే చోయ్‌(Abby Choi).. స్థానికంగా మోడల్‌, ఇన్‌ఫ్లుయెన్సర్ పేరుపొందారు. ఇటీవలే ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ డిజిటల్ కవర్‌పై ఆమె కనిపించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆమె అదృశ్యమయ్యారు. తాజాగా, ఆమె కాళ్లు లభ్యమైన ప్రాంతంలోనే చివరిసారి కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

ఫ్రిజ్‌లో చోయ్‌ కాళ్లతోపాటు, ఇంట్లో ఆమె గుర్తింపు కార్డు, క్రెడిట్ కార్డులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ రంపం, గ్లౌజులు, మాస్కులు వంటివి ఘటనాస్థలిలో కనిపించాయని చెప్పారు. ఈ వ్యవహారంలో ఆమె మాజీ భర్త అలెక్స్ క్వాంగ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఆమె మాజీ భర్త తండ్రి, తల్లి, వారి పెద్ద కుమారుడిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. మృతురాలి తల, మొండెం, చేతుల భాగాలు లభించాల్సి ఉందని.. వాటి అన్వేషణకు డ్రోన్‌లు, ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు. ఆమె శరీర భాగాలు లభ్యమైన ఇంటిని నిందితులు కొన్ని వారాల క్రితమే అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని