Booster Dose: నాలుగో నెలకే తగ్గుతున్న ‘బూస్టర్‌’ ప్రభావం!

ఫైజర్, మోడెర్నా టీకాల మూడో డోసు ప్రభావం నాల్గో నెల నాటికే గణనీయంగా తగ్గుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని అమెరికా సెంటర్స్ ఫర్‌ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తాజాగా వెల్లడించింది. రెండు డోసుల తర్వాత వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గుతుందని...

Published : 13 Feb 2022 01:14 IST

అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్: ఫైజర్, మోడెర్నా టీకాల మూడో డోసు ప్రభావం నాలుగో నెల నాటికే గణనీయంగా తగ్గుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజాగా వెల్లడించింది. రెండు డోసుల తర్వాత వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గుతుందని ఇప్పటికే ఆధారాలు ఉండగా.. తాజాగా బూస్టర్ డోసు రక్షణ విషయంలో సీడీసీ అధ్యయనం కీలకంగా మారింది. గతేడాది ఆగస్ట్ 26 నుంచి ఈ ఏడాది జనవరి 22 మధ్య కాలంలో కొవిడ్‌ సంబంధిత అనారోగ్యాలతో ఆస్పత్రులను సందర్శించిన 2.41 లక్షలమందికి పైగా వయోజనులు, పరిస్థితి విషమించి ఆస్పత్రుల్లో చేరిన 93 వేలకుపైగా రోగులనుంచి సమాచారాన్ని సేకరించి దీన్ని రూపొందించారు. టీకా తీసుకున్న, తీసుకోనివారిలో కొవిడ్‌ పాజిటివ్‌ ఫలితాలను పోల్చడంతో పాటు ప్రాంతం, వయస్సు, లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌, ఇతర అనారోగ్య సమస్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేశారు.

ఈ అధ్యయనం ప్రకారం.. ఒమిక్రాన్‌ సమయంలో హాస్పిటలైజేషన్‌ విషయంలో టీకా ప్రభావం మూడో డోస్‌ తర్వాత మొదటి రెండు నెలల్లో 91 శాతం ఉంది. నాలుగో నెల నాటికి 78శాతానికి పడిపోయింది. అదే.. ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితుల విషయంలో టీకా సమర్థత మూడో డోస్ తర్వాత మొదటి రెండు నెలల్లో 87 శాతంగా ఉంది. కానీ, నాలుగో నెల నాటికి 66 శాతానికి తగ్గిపోయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ రక్షణను కొనసాగించేందుకు మరో డోసు వేయాలా? అనే అంశంపై పరిశీలన చేపట్టాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం చాటుతోందని సీడీసీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒమిక్రాన్‌పై పోరాటంలో భాగంగా అమెరికాలో పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, దేశాధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ ఇటీవల అభిప్రాయపడిన విషయం తెలిసిందే. దీంతో సీడీసీ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని