China vs Taiwan: చైనా బెదిరింపులు.. తైవాన్‌ సహనం..!

తైవాన్‌ విలీనం ఖాయమని చైనా పునరుద్ఘాటించగా.. తమది ప్రజాస్వామ్య దేశమని తైవాన్‌ చెప్పింది. ఏ నిర్ణయమైనా ఇక్కడి ప్రజలే తీసుకుంటారంది. 

Updated : 01 Jan 2024 16:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నూతన సంవత్సరం వేళ చైనా-తైవాన్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తైవాన్‌ను విలీనం చేసుకుంటామని చైనా చెబుతుండగా.. కలిసి ప్రశాంతంగా ఎవరి బతుకు వారు బతుకుదాం అంటూ తైవాన్‌ ప్రతిపాదించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నూతన సంవత్సర సందేశంలో.. తైవాన్‌తో పునరేకీకరణ కచ్చితంగా చేసి తీరతామని ప్రకటించారు. తైవాన్‌ జలసంధికి ఇరువైపుల ఉన్న ప్రజలు సమష్టి ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు. ఈ విషయాన్ని షిన్హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. తైవాన్‌లో జనవరి 13వ తేదీన అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నాయి.

కొత్త ఏడాదికి ఇస్రో ఘన స్వాగతం.. ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం విజయవంతం

ఈ ఎన్నికల బరిలో ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు విలియమ్‌ లైని వేర్పాటువాదిగా చైనా అనుమానిస్తోంది. ఆయన అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. శనివారం చైనాలోని తైవాన్‌ అఫైర్స్‌ శాఖ ప్రతినిధి చెన్‌ బిన్హువా మాట్లాడుతూ విలియమ్‌ శాంతిని నాశనం చేస్తారని విరుచుకుపడ్డారు.  

మరోవైపు తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ యింగ్‌వెన్‌ సోమవారం మాట్లాడుతూ దీర్ఘకాలం తైపీ-బీజింగ్‌ కలిసి ఎవరి జీవితం వారు బతకాలని కోరారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాలను తైవాన్‌లోని ప్రజాస్వామ్య విధానాలు నిర్ణయిస్తాయని చెప్పారు. ఇరు దేశాలు త్వరలోనే ఆరోగ్యకర సుస్థిర సంబంధాలను పునరుద్ధరించుకొంటాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘తైవాన్‌ ప్రజల సమష్టి నిర్ణయంతో ఏదైనా జరుగుతుంది. మాది మొత్తంమీద ఓ ప్రజాస్వామ్య దేశం. చైనాతో బంధంపై నిర్ణయాలను ప్రజాస్వామ్య బద్ధంగా తీసుకొంటాం’’ అని బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని