Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు

చనిపోయేలోపైనా సంతోషంగా గడపాలని ఉక్రెయిన్‌ యువత కోరుకుంటోంది. ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నవారు, కొత్త ప్రేమ జంటలు ప్రస్తుతం వివాహ బంధంతో ఒక్కటవుతున్నాయి.......

Published : 27 Jun 2022 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌ యుద్ధం వేలాది అమాయకులను పొట్టనపెట్టుకుంది. ఎన్నో లక్ష్యాలు, మరెన్నో ఆశలతో ముందుకు సాగాలనుకున్న అనేకమంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఎప్పుడు ఏ బాంబు మీదొచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. చనిపోయేలోపైనా సంతోషంగా గడపాలని అక్కడి యువత కోరుకుంటోంది. ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నవారు, కొత్త ప్రేమ జంటలు ప్రస్తుతం వివాహ బంధంతో ఒక్కటవుతున్నాయి. కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌లో (Ukraine) వేలాది వివాహాలు జరుగుతున్నాయి.

ఓవైపు రష్యా (Russia) దండయాత్ర సాగిస్తుండగానే.. హింసాత్మక వాతావరణంలోనే ఉక్రెయిన్ జంటలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన రోజునే ఇహోర్‌ జక్వాట్‌స్కీ అనే యువకుడు కేథరీనా లైట్వినెంకోకు తన ప్రేమను తెలియజేశాడు. అయితే ఆ యుద్ధం వారిని విడదీసింది. ఇన్నిరోజులుగా దూరంగా ఉన్న జంట తాజాగా కీవ్‌లో వివాహామాడింది. యుద్ధం కారణంగా ఎప్పుడు చనిపోతామో తెలియదని, ఈలోపైనా కలిసి బతకాలని కోరుకుంటున్నట్లు ఆ జంట తెలిపింది. అంతా కలిసొస్తే జీవితం కొనసాగిస్తామని, లేదంటే భార్యాభర్తలుగా చనిపోతామని పేర్కొంది. కొందరు సైనికులు వివాహం చేసుకున్న తర్వాతే కదన రంగంలోకి అడుగుపెడుతున్నారు.

గత నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న నెల రోజుల తర్వాతే వివాహం చేసుకోవాల్సి ఉండేది. అయితే ఉక్రెయిన్​లో ప్రస్తుతం మార్షల్ లా కొనసాగుతోంది. సైనికులు, సాధారణ పౌరుల వివాహాలకు ఈ చట్టంలో వెసులుబాటు కల్పించింది. అదే రోజు దరఖాస్తు చేసుకొని, వివాహం పూర్తి చేసుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తోంది. దీంతో రాజధాని కీవ్​లోనే నాలుగు వేలకు పైగా జంటలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాయి. ఏప్రిల్​లో రష్యా సేనలు కీవ్ పరిసరాల నుంచి వైదొలిగాక వివాహాలు జోరందుకున్నాయి. వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్లిన చాలా మంది ఉక్రెయిన్​కు తిరిగొచ్చారు.

‘రేపు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే త్వరగా వివాహం చేసుకున్నాం’ అని మరో కొత్త జంట తెలిపింది. యుద్ధం నేపథ్యంలో పోలాండ్​కు వెళ్లిపోయిన డేరియా పొనోమకెరెంకో(22) ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చింది. ఉక్రెయిన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిన తన బాయ్​ఫ్రెండ్ యెవ్హెన్ నాలివైకో(23)ను కలుసుకొంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ జంట ఓ చర్చిలో వివాహమాడింది. కోరుకున్న వ్యక్తితో కొద్దికాలమైనా సంతోషంగా గడపాలనుకుంటున్నానని పొనోమకెరెంకో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని