Tangaraju: గంజాయి అక్రమ రవాణా.. ఉరికంబం ఎక్కనున్న భారత సంతతి వ్యక్తి

గంజాయి అక్రమ రవాణా (Drug Trafficking) కేసులో భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యకు పడిన ఉరిశిక్షను బుధవారం అమలు చేసేందుకు సింగపూర్‌ (Singapore) సిద్ధమైంది.

Published : 25 Apr 2023 23:58 IST

సింగపూర్‌: గంజాయి అక్రమ రవాణా (Drug Trafficking) కేసులో భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేసేందుకు సింగపూర్‌ (Singapore) సిద్ధమైంది. బుధవారం ఉరిశిక్షను వేయనుంది. మరణశిక్షను తగ్గించుకునేందుకు న్యాయపరంగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అమలు ఖాయమైంది. డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తిని ఉరితీయడం ఇది రెండోసారి. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో భారత సంతతి మలేసియన్‌ నాగేంద్రన్‌ ధర్మలింగంకు సింగపూర్‌ గతేడాది ఉరిశిక్షను అమలు చేసింది. తాజాగా గంజాయి కేసులో తంగరాజ్‌ను ఉరితీయనుంది.

భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య (Tangaraju Suppiah).. గంజాయి అక్రమ రవాణా కేసులో 2014లో అరెస్టయ్యాడు. ఒక కిలో గంజాయిని సింగపూర్‌కు అక్రమంగా తరలిస్తున్నాడన్న అభియోగాలు అతడిపై నమోదయ్యాయి. ఈ కేసులో అతడికి అక్టోబర్‌ 9, 2018లో మరణశిక్ష పడింది. మరో ఇద్దరితో కలిసి తంగరాజు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించినట్లు నిర్ధారించిన న్యాయస్థానం.. అతడికి శిక్ష విధించింది. ఈ క్రమంలోనే తంగరాజును బుధవారం ఉరితీసేందుకు సింగపూర్‌ ఏర్పాట్లు చేసింది.

వ్యతిరేకించిన బ్రిటిష్‌ బిలియనీర్‌..

తంగరాజ్‌కు ఉరిశిక్ష అమలు చేయడాన్ని బ్రిటన్‌ బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఓ అమాయకుడిని సింగపూర్‌ చంపబోతోందని వ్యాఖ్యానించిన ఆయన.. ప్రమాణాలకు అనుగుణంగా తంగరాజ్‌ కేసు విచారణ జరగలేదని ఆరోపిస్తూ తన బ్లాగ్‌లో అభిప్రాయపడ్డారు. బ్రాన్సన్‌కు యూరోపియన్‌ యూనియన్‌, ఆస్ట్రేలియా కూడా మద్దతుగా నిలిచాయి. తంగరాజ్‌ ఉరిని నిలిపేయాలంటూ నార్వే, స్విట్జర్లాండ్‌ దౌత్యవేత్తలు సింగపూర్‌కు విజ్ఞప్తి చేశారు. అతడి ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని సూచించాయి.

స్థానిక చట్టాల ప్రకారమే..

ఈ వివాదంపై సింగపూర్‌ హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. రిచర్డ్‌ బ్రాన్సన్‌ ప్రకటనను తీవ్రంగా తప్పుపట్టిన హోంశాఖ.. ఆయన వ్యాఖ్యలు సింగపూర్‌ న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను కించపరిచేలా ఉన్నాయని మండిపడింది. అలాంటి ప్రకటన చేసేముందు కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. సింగపూర్‌కు గంజాయి తరలించే ఉద్దేశం తంగరాజుకు ఉందని.. అందులో భాగంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిపినట్లు తేలిందని వెల్లడించింది. మాదకద్రవ్యాలకు సంబంధించి స్థానిక చట్టాల ప్రకారమే అతడికి ఉరిశిక్ష అమలు చేస్తున్నామని సింగపూర్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని