Joe Biden: పుతిన్‌ను అడ్డుకోవాల్సిందే.. లేకపోతే..!

రష్యా-ఉక్రెయిన్‌(Russia-Ukraine) మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా చేసిన భీకర దాడిపై అమెరికా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. 

Updated : 30 Dec 2023 13:51 IST

వాషింగ్టన్‌: తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా(Russia) జరిపిన భీకర దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ను ధ్వంసం చేసే విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) ఉద్దేశంలో ఏ మార్పు రాలేదని, ఆయన్ను అడ్డుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.

‘యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు కావొస్తున్నా పుతిన్‌(Putin) లక్ష్యం ఏ మాత్రం మారలేదు. ఆయన ఉక్రెయిన్‌ను ధ్వంసం చేయడానికి, అక్కడి ప్రజలను అణచివేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆయన్ను అడ్డుకోవాలి’ అని బైడెన్‌ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. రష్యా నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు అందించిన గగనతల రక్షణ వ్యవస్థను ఉక్రెయిన్ వినియోగించుకుంటోందని చెప్పారు. రష్యా దూకుడు వేళ.. ఉక్రెయిన్‌కు నిరంతర సాయం కొనసాగాలని, దీనిపై చట్టసభలు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, ఈ ఏడాది తుది ప్యాకేజీగా 250 మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర పరికరాలను ఉక్రెయిన్‌కు అందించేందుకు అమెరికా అంగీకరించింది.

ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) శుక్రవారం భారీ స్థాయిలో విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్లతో రాజధాని కీవ్‌ సహా ప్రధాన నగరాలన్నింటిపైనా దాడి చేసింది. ఈ దాడుల్లో 31 మంది మృతి చెందగా, 120 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇదే అతి పెద్ద గగనతలదాడి అని ఉక్రెయిన్‌ పేర్కొంది.

‘చైనా నిఘా బెలూన్‌ ఘటన.. అమెరికా ఇంటర్నెట్‌నే వాడిన డ్రాగన్‌..!’

దాడులతో రష్యా(Russia) పంపుతున్న సందేశాన్ని ప్రపంచం అర్థం చేసుకోవాలని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంపై చర్చలు జరుపుతున్న పలు దేశాల పార్లమెంటులు, చర్చలకు రష్యా సానుకూలంగా ఉందని వార్తలు రాస్తున్న ప్రసార మాధ్యమాలు ఈ శబ్దాలను ఆలకించాలన్నారు. భారీగా ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయాలని మిత్ర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని