‘పెళ్లి చేసుకోమని ఆమెను 5 సార్లు అడిగా’: జో-జిల్‌ ప్రేమ కహానీ ఇదే..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జిల్ బైడెన్‌(Joe Biden-Jill Biden) తమ ప్రేమ ముచ్చట్లు వెల్లడించారు. 

Updated : 16 Feb 2024 17:51 IST

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి దక్కించుకోవాలని చూస్తున్న జో బైడెన్‌(Joe Biden) తన జీవితంలోని మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. తన సతీమణి జిల్‌ బైడెన్‌(Jill Biden)తో ప్రేమలో పడిన రోజుల్ని అమెరికన్లతో పంచుకున్నారు.  వాలెంటైన్స్‌ డేన ‘మీట్ క్యూట్స్‌ ఎన్‌వైసీ’(Meet Cutes NYC) ఇన్‌స్టా వేదికగా తమ ప్రేమను బయటపెట్టారు.

జో, జిల్ వివాహబంధంలోకి అడుగుపెట్టి 48 ఏళ్లు కావొస్తోంది. వారిద్దరూ మొదటిసారి కలుసుకున్న సందర్భం.. ఆ తర్వాత పరిచయం బంధంగా ముడిపడిన విషయాలను వెల్లడించారు. 1975లో వారిద్దరూ మొదటిసారి మీట్ అయ్యారు. అప్పుడు జో వయసు 33. సెనెటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 24 ఏళ్ల జిల్ ఫైనల్‌ ఇయర్ విద్యార్థిని. వారిద్దరి పరిచయానికి కారణమైంది మాత్రం జో(Joe Biden) సోదరుడు. ‘‘ఒకరోజు నా సోదరుడు ఫోన్‌ చేసి జిల్ గురించి చెప్పాడు. ఆమె చక్కగా ఉంటుంది. కానీ రాజకీయాలను ఇష్టపడదు’’ అని అన్నాడు.

‘ప్రేమలేఖ’తో విరాళాలు సేకరించిన ట్రంప్‌

ఈ మాట తర్వాత జిల్ అందుకున్నారు. ఆ రోజుల్లో అనుకోనివిధంగా వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పారు. ఆ ఫోన్ చేసింది జో బైడెనే. ‘‘ఆయన ఒక శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి, జో బైడెన్‌ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు. నా నంబర్ మీకు ఎలా వచ్చిందంటూ వెంటనే నేను ప్రశ్నించాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే.. ఈ రోజు సాయంత్రం మనం బయటకు వెళ్దామా..? అన్నారు. ‘నేను మరొకరితో డేట్‌లో ఉన్నాను కుదరదు’  అని చెప్పేశాను. అయినా సరే.. మీరు దానిని బ్రేక్‌ చేస్తారా..? అంటూ జో అడిగారు’’ అని జిల్ గుర్తు చేసుకున్నారు. ఆమె ఫైనల్‌గా ‘ఎస్‌’ చెప్పేలోపు.. తనను పెళ్లి చేసుకోమని బైడెన్(Joe Biden) ఐదుసార్లు అడిగారట.

అప్పటికే జో బైడెన్‌ వైవాహిక జీవితంలో దెబ్బతిని ఉన్నారు. ఆయన భార్య, కుమార్తె 1972లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఒంటరిగా ఉంటూ ఇద్దరు కుమారులు బ్యూ, హంటర్‌ సంరక్షణను చూస్తున్నారు. అప్పుడే జిల్‌తో పరిచయం ఏర్పడింది. 1977లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని తాము తీసుకునే నిర్ణయం ఎంత కీలకమో గుర్తించామని ఆమె అన్నారు. ‘మేం ఇద్దరం పెళ్లి చేసుకుంటే అది ఎప్పటికీ కొనసాగాలి. ఎందుకంటే ఆ చిన్నారులు అప్పటికే కారు ప్రమాదంలో తమ తల్లిని, చెల్లిని పోగొట్టుకున్నారు. అందుకే వారికి మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని అనుకున్నాను’ అంటూ ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఆ రోజు అనుకున్నట్లుగానే నేటివరకు ఆయన ఎదుగుదలలో ఆమె వెన్నంటే ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని