Justin Trudeau: ‘మేం చేసింది ఘోర తప్పిదం.. క్షమించండి’: కెనడా ప్రధాని ట్రూడో

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau)ను ‘నాజీ వివాదం’ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇది పార్లమెంట్‌లో జరిగిన ఘోర తప్పిదమంటూ క్షమాపణలు చెప్పారు.  

Published : 28 Sep 2023 11:00 IST

టొరంటో: ఓ వైపు ‘ఖలిస్థానీ’ అంశంలో భారత్‌తో వివాదం జరుగుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau)ను ‘నాజీ’ అంశం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అది ఇప్పటికే తన ప్రభుత్వంలో స్పీకర్‌ రాజీనామాకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ట్రూడో(Justin Trudeau).. బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అలాగే ఉక్రెయిన్‌ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు ఇప్పటికే దౌత్యమార్గాల్లో చర్చలు జరిపారు.

రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy) ఇటీవల కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గత శుక్రవారం పార్లమెంట్‌కు వచ్చారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ ఆంటోనీ రోటా ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్‌ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్‌ రోటా స్వయంగా అతడిని పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడిగా కీర్తించారు. దీంతో అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీ సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు.

పార్లమెంట్‌ గౌరవించిన హంకా రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ పక్షాన పోరాడిన ‘14వ వాఫన్‌ గ్రనేడియర్‌ డివిజన్‌’కు చెందిన వ్యక్తి అని ఆ తర్వాత తేలింది.   దాంతో ఈ ఘటనపై ట్రూడో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దాంతో మంగళవారం స్పీకర్ రోటా పదవికి రాజీనామా చేశారు. అయినా ఈ వివాదం చల్లారకపోవడంతో ట్రూడో(Justin Trudeau) తాజాగా బహిరంగ క్షమాపణలు చెప్పారు.

వీసాలతో సిక్కు యువతకు ఎర

‘శుక్రవారం జరిగిన ఘటనకు ఈ సభ తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయంలో ఇప్పటికే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy), ఆ దేశ ప్రతినిధి బృందాన్ని దౌత్యమార్గాల ద్వారా సంప్రదించాం. ఆ రోజున పార్లమెంట్‌కు వచ్చిన వ్యక్తిని గుర్తించడంలో ఘోర తప్పిదం జరిగింది. నాజీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన వారి చేదు జ్ఞాపకాలను విస్మరించినట్లయింది’ అని ట్రూడో విచారం వ్యక్తం చేశారు.

కెనడా పార్లమెంట్‌లో నాజీ సైనికుడికి జరిగిన సత్కారాన్ని రష్యా తీవ్రంగా నిరసించింది. ‘ఉక్రెయిన్ లక్ష్యాన్ని తప్పుదారి పట్టించేందుకు రష్యా ఈ తప్పిదాన్ని రాజకీయం చేస్తోంది. ఇది నాకు ఇబ్బందిగా ఉంది’ అని ట్రూడో(Canadian Prime Minister Justin Trudeau) ఇప్పటికే ఓ సారి విలేకర్ల వద్ద వాపోయిన విషయం తెలిసిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని