Kim Jong Un: కిమ్‌ బరువు 140 కిలోలు.. తీవ్ర నిద్రలేమితో అవస్థలు..!

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు సంబంధించిన కీలక విషయాలను దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ సంస్థ బయటపెట్టింది. కిమ్‌ బరువు సుమారు 140 కిలోలు ఉన్నట్లు అంచనా వేసింది. 

Updated : 01 Jun 2023 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నాడని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎన్‌ఐఎస్‌) అంచనాకొచ్చింది. దీనికి తోడు అతడు విపరీతంగా బరువు పెరిగినట్లు గుర్తించింది. అతడికి ఉన్న ఆల్కహాల్‌, నికోటిన్‌ వ్యసనాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారులు.. కిమ్‌ నిద్రలేమి సమస్యకు చికిత్స కోసం లోతైన వైద్యసమాచారం సేకరించే పనిలో పడ్డట్లు ఎన్ఐఎస్‌ గుర్తించింది. ఈ మేరకు ఎన్‌ఐసీ బ్రీఫింగ్స్‌ను ద.కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్‌ కమిటీ సభ్యుడు యూసాంగ్‌ బూమ్‌ మీడియాతో పంచుకొన్నారు. ఇటీవల ఉత్తరకొరియా భారీ ఎత్తున విదేశీ సిగరెట్లను, ఆల్కహాల్‌తో పాటు తీసుకునే చిరుతిళ్లను దిగుమతి చేసుకొన్నట్లు వెల్లడించారు. దీనికి కిమ్‌ ఇటీవలి చిత్రాలను కృత్రిమ మేధతో విశ్లేషించగా.. అతడు బరువుపెరిగినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం 140 కిలోల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు.  

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మద్యానికి, సిగరెట్లకు బానిసగా మారిపోయినట్లు అమెరికాకు చెందిన ఓ పత్రిక కథనంలో పేర్కొంది. దీంతో అతడిలో నిద్రలేమి సమస్యలు తలెత్తినట్లు తెలిపింది. ఫలితంగా అతడి కంటి కింద తీవ్రమైన నల్లటి వలయాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. అతడు జోల్పిడియం వంటి ఔషధాలను కూడా వాడుతున్నట్లు తెలిపింది.

మున్ముందు నిఘా ఉపగ్రహ ప్రయోగాలుంటాయి..: కిమ్‌ సోదరి 

ఉత్తర కొరియా త్వరలోనే నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేరుస్తుందని కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ వెల్లడించారు. భవిష్యత్తులో తమ దేశం నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా కేసీఎన్‌ఏ గురువారం పేర్కొంది. ‘‘సమీప భవిష్యత్తులో సైనిక నిఘా ఉపగ్రహాలను సరైన కక్ష్యలో ప్రవేశపెడతాం’’ అని యో జోంగ్‌ వెల్లడించారు. బుధవారం మల్లిగ్యాంగ్‌ - 1 ఉపగ్రహంతో.. కొత్తగా అభివృద్ధి చేసిన చొల్లిమా-1 రాకెట్‌ను నింగిలోకి పంపింది. అయితే రెండు దశల అనంతరం ఇంజిన్‌లు థ్రస్ట్‌ను కోల్పోవడంతో రాకెట్‌ సముద్రంలో కూలిపోయిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని