Kim Jong Un: రైఫిల్‌ గురిపెట్టిన కిమ్‌!

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un).. అక్కడి ఆయుధ ఫ్యాక్టరీలు, క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రాలను సందర్శించి వివిధ రకాల ఆయుధాల పనితీరును స్వయంగా పరిశీలించారు.

Published : 06 Aug 2023 14:21 IST

సియోల్‌: దేశం ఆహార సంక్షోభంలో ఉన్నా.. ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) మాత్రం క్షిపణి పరీక్షలు, సైనిక సమీక్షలతో బిజీగా గడిపేస్తున్నారు. తాజాగా దేశంలోని ఆయుధ ఫ్యాక్టరీలు, క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రాల్లో పర్యటించారు. దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఆయుధ శక్తిని మరింత పెంచాలని సిబ్బందికి సూచించారు. అగ్రరాజ్యం అమెరికాతోపాటు దక్షిణ కొరియాతో (South Korea) ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఆయుధ ఫ్యాక్టరీల్లో కిమ్‌ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వ్యూహాత్మక క్రూయిజ్‌ క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రంతోపాటు ఇతర ఆయుధ ఫ్యాక్టరీలు, మానవరహిత గగనతల వాహనాలు (యూఏవీలు), భారీ రాకెట్‌ లాంచర్లకు అవసరమైన పనిముట్ల తయారీ కేంద్రాలను వరుసగా మూడు రోజులపాటు ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సందర్శించినట్లు అక్కడి (North Korea) అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఈ సందర్భంగా పలు ఆయుధాలను కిమ్‌ స్వయంగా పరిశీలించారు.

తమ శైలికి అనుగుణంగా వ్యూహాత్మక ఆయుధాలను అభివృద్ధి చేయాలని.. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికత కలిగిన ఇంజిన్లను రూపొందించాలని కిమ్‌ నిపుణులకు సూచించినట్లు కేసీఎన్‌ఏ తెలిపింది. భారీ దాడులకు ఉపయోగించే రాకెట్లను, అత్యాధునిక క్రూయిజ్‌ క్షిపణిలతోపాటు ఇటీవల కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ఆయన పరిశీలించారు. ఇలా వివిధ ఆయుధ ఫ్యాక్టరీల్లో రైఫిళ్ల పనితీరును స్వయంగా పరిశీలించిన ఫొటోలను అక్కడి మీడియా విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని