Peru: టేకాఫ్‌లో ఊహించని ప్రమాదం.. ఫైర్‌ ట్రక్కును ఢీకొన్న విమానం!

పెరూ రాజధాని లిమాలోని విమానాశ్రయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్‌ తీసుకునేందుకు పరుగులు పెడుతోన్న ఓ విమానం.. అంతలోనే రన్‌వే వచ్చిన అగ్నిమాపక శకటాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఫైర్‌ ట్రక్కులోని ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు.

Published : 20 Nov 2022 01:49 IST

లిమా: పెరూ(Peru) రాజధాని లిమాలోని విమానాశ్రయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్‌ తీసుకునేందుకు పరుగులు పెడుతోన్న ఓ విమానం.. అంతలోనే రన్‌వేపైకి వచ్చిన అగ్నిమాపక శకటాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఫైర్‌ ట్రక్కులోని ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. మరోవైపు.. విమానం వెనుక భాగం దెబ్బతినడంతో పెద్దఎత్తున పొగలు వెలువడ్డాయి. అయితే.. ప్రయాణికులు, సిబ్బందికి ప్రాణాపాయం తప్పినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

లాట్‌అమ్‌ ఎయిర్‌లైన్స్‌(LATAM Airlines)కు చెందిన ఓ విమానం 102 మంది ప్రయాణికులతో లిమాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జులియాకా వెళ్లేందుకు టేకాఫ్‌ కోసం బయలుదేరింది. ఈ క్రమంలో రన్‌వేపై వేగంగా దూసుకెళ్తుండగా.. అంతలోనే ఓ అగ్నిమాపక వాహనం అడ్డుగా వచ్చింది. దీంతో వాహనాన్ని ఢీకొన్న విమానం.. అలాగే ముందుకు దూసుకెళ్లి, నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగి, పెద్దఎత్తున పొగలు వెలువడ్డాయి. ఫైర్‌ ట్రక్కులోని ఇద్దరు సిబ్బంది మృతి చెందారు.

విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి ప్రాణాపాయం తప్పిందని.. వారిలో 61 మందిని సమీప ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 20 మందికి చికిత్స అందించామని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పెరూ అధ్యక్షుడు పెడ్రో కాసిల్లో.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నామని, కుట్ర కోణం దిశగానూ విచారణ చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. తదుపరి నోటీసు వచ్చేవరకు ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను నిలిపేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని