Ukraine Crisis: దేశాన్ని చీకటిలోకి నెట్టేస్తే చర్చలు జరుగుతాయా?: జెలెన్‌ స్కీ

విద్యుత్‌, నీటి సరఫరా వ్యవస్థలే లక్ష్యంగా రష్యన్‌ సైన్యం దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ద్వారా దేశంపై ఆదిపత్యం చెలాయించేందుకు పుతిన్‌ కుటిలయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

Published : 18 Oct 2022 18:20 IST

కీవ్‌: విద్యుత్‌, నీటి సరఫరా వ్యవస్థలే లక్ష్యంగా రష్యన్‌ సైన్యం దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ద్వారా దేశంపై ఆదిపత్యం చెలాయించేందుకు పుతిన్‌ కుటిలయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఉక్రెయిన్‌ ప్రజల్ని చీకటిలోకి నెట్టేస్తే శాంతి చర్చలు జరుగుతాయనుకోవడం అసంభవం అని చెప్పారు. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడుల్లో మూడొంతుల్లో ఒక వంతు విద్యుత్‌ స్టేషన్లన్నీ నాశనమైపోయాయని జెలెన్‌ స్కీ తెలిపారు. పుతిన్‌ అధికారంలో ఉండగా రష్యాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రష్యా విజయానికి దాదాపు దారులన్నీ మూసుకుపోయాయని, అందువల్ల తన సైనికపరాజయాలను ఉగ్రవాద చర్యలతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోందని ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ జెలెన్‌స్కీ ఆరోపించారు. ప్రపంచదేశాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

సూసైడ్‌ డ్రోన్‌లతో దాడి!

కేవలం క్షిపణులతో మాత్రమే కాకుండా రష్యన్‌ సేనలు తమపై దాడి చేస్తున్న పంథాను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయని జపోరిజియా గవర్నర్‌ తెలిపారు. తాజాగా సూసైడ్‌ డ్రోన్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. నిర్దేశిత లక్ష్యానికి డ్రోన్‌లు చేరుకున్న తర్వాత రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా వాటిని పేల్చివేస్తున్నారని వివరించారు. ఖార్కివ్ పట్టణం తూర్పు ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో సోమవారం 8 రాకెట్లతో దాడులకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. యుద్ధం నేపథ్యంలో రష్యాకు వేల సంఖ్యలో డ్రోన్లను ఇరాన్‌ సరఫరా చేస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ఇరాన్‌ తయారు చేసిన షాహెద్‌ డ్రోన్లు సోమవారం కీవ్‌ నగరంలో దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. గత వారం రోజుల్లో  100కు పైగా డ్రోన్లు ఉక్రెయిన్‌లోని వివిధ పరిశ్రమలు, విద్యుత్‌ స్టేషన్లు, నివాస సముదాయాల లక్ష్యంగా దాడులకు తెగబడినట్లు ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని