COVID-19: గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 10 వేల కొవిడ్‌ మరణాలు: WHO

COVID-19: కొత్త వేరియంట్‌ వ్యాప్తితో పాటు సెలవుల్లో ప్రజలు గుమిగూడటం వల్ల డిసెంబర్‌లో కరోనా మరణాలు పెరిగాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

Updated : 11 Jan 2024 15:16 IST

జెనీవా: క్రిస్మస్‌, థ్యాంక్స్ గివింగ్ సెలవుల్లో ప్రజలు గుమిగూడటంతో పాటు కొత్త వేరియంట్‌ వల్ల గత నెలలో కొవిడ్‌ (COVID-19) మహమ్మారి వ్యాప్తి పెరిగిందని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)’ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ (Tedros Adhanom Ghebreyesus) వెల్లడించారు. మహమ్మారి కారణంగా డిసెంబర్‌లో దాదాపు 10 వేల మరణాలు నమోదయ్యాయని తెలిపారు. కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరినవారి సంఖ్య 42 శాతం పెరిగినట్లు చెప్పారు. ముఖ్యంగా ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో కరోనా వ్యాప్తి పెరిగినట్టు వెల్లడించారు.

మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న సమయంతో పోలిస్తే గత నెల నమోదైన మరణాలు తక్కువే అయినప్పటికీ అవన్నీ నివారించదగినవని టెడ్రోస్‌ (Tedros Adhanom Ghebreyesus) అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపారు. కానీ, వాటిని అధికారికంగా నమోదు చేయడం లేదన్నారు. ఈ విషయంలో అన్ని దేశాలు అప్రమత్తంగా వ్యవహరించి.. బాధితులకు కావాల్సిన చికిత్స అందించాలని సూచించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జేఎన్‌.1 వేరియంట్‌ అత్యధికంగా ప్రబలుతోందని టెడ్రోస్‌ (Tedros Adhanom Ghebreyesus) తెలిపారు. ఇది ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ అయినందున.. ఇప్పటికే తీసుకున్న వ్యాక్సిన్లు కొంత వరకు రక్షణనిస్తాయన్నారు. అవసరమైనప్పుడు మాస్కులు ధరించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మహమ్మారి సోకకుండా వ్యాక్సిన్లు ఆపవని.. ఆస్పత్రుల్లో చేరే ముప్పు నుంచి మాత్రమే బయటపడేస్తాయని WHO అత్యవసర విభాగాధిపతి మైఖేల్‌ ర్యాన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని