Netanyahu: యుద్ధం వేళ.. నెతన్యాహుకు చేదు అనుభవం

Israel-Hamas Conflict: హమాస్‌ చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు తమకు ఇంకా సమయం కావాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. దీనిపై బందీల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Updated : 26 Dec 2023 13:30 IST

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం మొదలై 80 రోజులు దాటింది. ఇప్పటికీ హమాస్‌ చెరలో ఉన్న బందీలు ఇంకా విడుదల కాలేదు. మరోపక్క ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ప్రత్యేక పార్లమెంటరీ సెషన్‌లో మాట్లాడారు. అయితే.. బందీల కుటుంబాల నుంచి ఆయన వ్యతిరేకత ఎదుర్కొన్నారు.(Israel-Hamas Conflict)

నెతన్యాహు(Benjamin Netanyahu) మాట్లాడుతున్న సమయంలో.. పార్లమెంట్‌ గ్యాలరీలో ఉన్న బందీల బంధువులు ఆందోళనకు దిగారు. బందీల ఫొటోలు, పేర్లు ఉన్న పోస్టర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. బందీలను విడిపించేందుకు మరింత సమయం కావాలని నెతన్యాహు చెప్పగా.. వారంతా సమయం లేదని కేకలు వేశారు. ఇప్పుడే..! ఇప్పుడే..!  అంటూ నినాదాలు చేశారు. ‘మీరు వారిని తిరిగి తీసుకువస్తారని మేం నమ్ముతున్నాం’, ‘అక్కడ మీ బిడ్డలే ఉంటే ఏం చేసేవారు..?’ ‘ఇప్పటికే 80 రోజులు గడిచాయి. ఒక్కో నిమిషం నరకంలా అనిపిస్తుంది’ అని ప్లకార్డుల ద్వారా ఆ కుటుంబాలు తమ ఆవేదనను వెళ్లగక్కాయి.

‘రాజకీయాల్లోకి ఉగ్ర వారసుడు.. పాక్‌ ఎన్నికల బరిలో హఫీజ్‌ తనయుడు..!’

వారిని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిరంతర చర్యలు చేపడుతూనే ఉందని ఈ సందర్భంగా నెతన్యాహు వెల్లడించారు. ‘నేను ఇప్పటికే బందీల కుటుంబాలతో సమావేశం అయ్యాను. వారి బాధలు విన్నాను. ఈ పవిత్ర మిషన్ మనల్ని ఏకం చేసింది’ అని అన్నారు. మధ్యలో యుద్ధానికి స్వల్ప విరామాలు ఇవ్వడంతో కొంతమంది బందీలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 129 మంది హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్‌ వెల్లడించింది.

ఈ ప్రసంగానికి ముందు నెతన్యాహు(Benjamin Netanyahu) గాజా(GAZA)లో పర్యటించారు. యుద్ధానికి విరామం ఇస్తారంటూ మీడియాలో వస్తోన్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తాము యుద్ధాన్ని ముగించడం లేదని స్పష్టం చేశారు. సైనికపరంగా ఒత్తిడి ఉంటేనే.. బందీల విడుదల సాధ్యమవుతుందని అన్నారు. హమాస్‌ అంతం కాకుండా శాంతి ఉండదని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని