Arcturus: పలు దేశాల్లో ‘ఆక్టురస్‌’ కలవరం.. 22 దేశాల్లో వ్యాప్తి!

కొన్ని నెలల క్రితం కొత్తగా వెలుగు చూసిన ఆక్టురస్‌ (Arcturus) వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్లతో పోలిస్తే ఈ ఆక్టురస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 13 Apr 2023 22:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌(Corona Virus) ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని ప్రపంచదేశాలు భావిస్తున్న వేళ పలుచోట్ల కొవిడ్‌ ప్రాబల్యం మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో ఈ ఒక్కరోజే 10వేల కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే, ఈ స్థాయిలో కొవిడ్‌ మళ్లీ విజృంభించడానికి ఒమిక్రాన్‌ ఉపరకమైన XBB.1.16 వేరియంట్ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిని సాంకేతికంగా ఆక్టురస్‌ (Arcturus) అని పిలుస్తున్నారు.

22 దేశాల్లో వ్యాప్తి..

ఆక్టురస్‌ (Arcturus) అనేది కొత్త వేరియంట్‌ కాదు. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాప్తిలో ఉన్న ఎక్స్‌బీబీ.1.16కు ప్రత్యామ్నాయ పేరుగా పిలుస్తున్నారు. అయితే, అంతకుముందు వెలుగు చూసిన వేరియంట్లతో పోలిస్తే ఈ ఆక్టురస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నట్లు అంచనా. అమెరికా, బ్రిటన్‌తో సహా 22 దేశాల్లో ఈ వేరియంట్‌ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్‌లోనూ భారీ స్థాయిలో ఈ కేసులు వెలుగుచూస్తుండడంపై అప్రమత్తమైన డబ్ల్యూహెచ్‌ఓ.. ఈ వేరియంట్‌ ప్రాబల్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.

‘ఈ వేరియంట్‌ అంచనా వేసిన నమూనాలో స్థిరంగా లేదు. వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటివరకు ఒమిక్రాన్‌కు సంబంధించిన 600 ఉపరకాలు ప్రాబల్యంలో ఉన్నాయి. అందులోని ఒకరకమే ఎక్స్‌బీబీ.1.16. ఇది అంతకుముందు వెలుగుచూసిన, అత్యంత వేగంగా వ్యాపించే ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్‌ మాదిరిగానే కనిపిస్తుంది. అదనంగా స్పైక్‌ ప్రొటీన్‌లో ఒక మ్యుటేషన్‌ మాత్రమే ఉంది. ఎక్స్‌బీబీ.1.5తో పోలిస్తే ఇన్‌ఫెక్షన్‌ రేటు 1.2 రెట్లు అధికంగా ఉన్నట్లు టోక్యో యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. అందుకే దీన్ని పర్యవేక్షిస్తున్నాం’ అని డబ్ల్యూహెచ్‌వో కొవిడ్‌-19 టెక్నికల్‌ హెడ్‌ మారియా వాన్‌ ఖేర్కోవ్‌ పేర్కొన్నారు.

భారత్‌లోనూ కొవిడ్‌ పెరుగుదల..

ప్రస్తుతం భారత్‌లో 44,998 కొవిడ్‌ క్రియాశీల కేసులు ఉన్నాయి. ఆక్టురస్‌ (Arcturus) వేరియంట్‌ను భారత్‌లో తొలిసారి జనవరి నెలలోనే కనుగొన్నారు. ఫిబ్రవరి నాటికి 59 నమూనాల్లో బయటపడ్డాయి. మార్చి నెలలో జరిపిన పరీక్షల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 76 ఈ వేరియంట్‌ కేసులు గుర్తించారు. ఈ వేరియంట్‌ కారణంగానే దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మరికొన్ని రోజుల్లోనే భారత్‌లో కొవిడ్‌ ఎండమిక్‌ దశకు చేరుకుంటుందని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని