Covid Vs Kim: కిమ్‌ సామ్రాజ్యంలో కరోనా ఉగ్రరూపం..?

కిమ్‌ సామ్రాజ్యానికి ఇతర దేశాల సహకారం లేకుంటే భారీ స్థాయిలో వైరస్‌ సంక్రమణ, మరణాల ముప్పు తప్పదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 14 May 2022 02:43 IST

అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఉత్తర కొరియా

సియోల్‌: కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచం వణికిపోయినప్పటికీ గత రెండున్నరేళ్లుగా తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటూ ఉత్తర కొరియా చెబుతూ వచ్చింది. వ్యాక్సిన్‌ సహాయం చేస్తామని పలు దేశాలు ముందుకొచ్చినప్పటికీ తమకు అవసరం లేదంటూ దూరం పెట్టింది. అయితే, తాజాగా తమ దేశంలో వైరస్‌ వెలుగు చూసిందని ప్రకటించిన మరుసటి రోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, కరోనా కేసులపై స్పష్టత ఇవ్వనప్పటికీ దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నారని తెలిపింది. వ్యాక్సిన్‌ల లేమి, పరీక్షల సామర్థ్యం అతితక్కువగా ఉండడం, భయంకరమైన ఆరోగ్య వ్యవస్థ, పేదరికం వంటి సమస్యలు ఎదుర్కొంటోన్న ఉత్తర కొరియాలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగితే పరిస్థితి ఏంటనే విషయంపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో కిమ్‌ సామ్రాజ్యానికి ఇతర దేశాల సహకారం లేకుంటే భారీ స్థాయిలో వైరస్‌ సంక్రమణ, మరణాల ముప్పు తప్పదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చైనా నుంచే ప్రవేశం..?

ప్యాంగ్యాంగ్‌లోని కొందరిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూసినట్లు ఉత్తర కొరియా ఇటీవల ప్రకటించింది. అయితే, ఎంతమందిలో వైరస్‌ నిర్ధారణ అయిన విషయాన్ని చెప్పనప్పటికీ మూడున్నర లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నారని మాత్రమే పేర్కొంది. వీరిలో లక్షా 87 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచామని.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మరణించిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ గుర్తించామని వెల్లడించింది.  అయితే, దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను తీవ్రంగా పరిగణించిన ఉత్తర కొరియా, దేశవ్యాప్తంగా ‘అత్యంత అత్యవసర పరిస్థితి’ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, సరిహద్దు ప్రాంతమైన చైనా నుంచే ఒమిక్రాన్‌ వేరియంట్‌ తమ దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు ఉత్తర కొరియాలో కేవలం 64,200 కొవిడ్‌ పరీక్షలు మాత్రమే నిర్వహించారు.

మిలటరీ పరేడ్‌తో మొదలు

రెండున్నరేళ్లుగా కరోనా వైరస్‌ దరిచేరలేదని చెబుతోన్న ఉత్తర కొరియాలో వైరస్‌ వ్యాప్తి మొదలైనట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇన్ని నెలలపాటు సరిహద్దులు మూసివేసిన ఉ.కొరియాలో ఈ స్థాయిలో వైరస్‌ విజృంభణ ఎలా మొదలైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఏప్రిల్‌ 25వ తేదీన మిలటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో పరేడ్‌ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నప్పటికీ మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలేవీ కనిపించలేదు. అప్పటినుంచే వేల మందిలో కొవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయని.. దేశంలో కొవిడ్‌ విజృంభణకు మిలటరీ పరేడ్‌తో సంబంధం ఉండవచ్చని దక్షిణ కొరియా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే, అంతకుముందు కూడా పరేడ్‌లు జరిగినప్పటికీ మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారని గుర్తుచేశారు.

టీకా మాటే ఎరుగని ఉత్తరకొరియా

ఇప్పటికే లక్షల మంది కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు వార్తలు రావడం చూస్తుంటే ఉత్తర కొరియాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘దేశంలో మెజారిటి ప్రజలకు కరోనాను నిరోధించే రోగనిరోధకత లేదు. కనీసం ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేసిన దాఖలాలు లేవు. కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఔషధాలు కూడా లేవు’ అని దక్షిణ కొరియాకు చెందిన ఓ ప్రొఫెసర్‌ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ జరిగినప్పటికీ అక్కడ ఇంకా కొవిడ్‌ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అలాంటిది కనీస వైద్య సదుపాయాలు లేని ఉత్తర కొరియాలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లాక్‌డౌన్‌ ఒక్కటే శరణ్యమా..?

కొవిడ్‌ కట్టడిని అదుపు చేయాలంటే ఉత్తర కొరియా చేతిలో అస్త్రాలు తక్కువేనని చెప్పవచ్చు. అందుకే మొదటి కేసు నమోదైన తొలిరోజే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. కొవిడ్‌ పరీక్షలు సంగతి పక్కనబెడితే లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్‌లో ఉండాలని చెబుతోంది. పని ప్రదేశాల్లోనూ దూరంగా ఉండాలని సూచిస్తోంది. అయితే, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు లేనందున చిట్టచివరగా వైరస్‌తో కలిసి జీవించే మార్గాన్ని ఉత్తర కొరియా అనుసరించవచ్చనే అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.

టీకా కోసం ప్రయత్నిస్తుందా..?

ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు డబ్ల్యూహెచ్‌ఓతో పాటు ఇతర దేశాలు కృషి చేశాయి. ఇందులో భాగంగా ఉత్తర కొరియాకు వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రకటించినప్పటికీ కిమ్‌ మాత్రం ముందుకు రాలేదు. తాజాగా కరోనా వైరస్‌ విజృంభణ మొదలైన నేపథ్యంలోనూ వ్యాక్సిన్‌ల కోసం ఇతర దేశాల సహాయాన్ని కిమ్‌ కోరకపోవచ్చని దక్షిణ కొరియా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆయా దేశాలే వ్యాక్సిన్‌ అందించేందుకు ముందుకు వస్తే మాత్రం వాటిని స్వీకరించే అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. కరోనాతో ప్రాణనష్టం ఉన్నప్పటికీ వ్యాక్సిన్‌ల కంటే వైరస్‌ సోకడం ద్వారానే రోగనిరోధక శక్తిని పొందే మార్గాన్నే కిమ్‌ అనుసరించవచ్చని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని