Israel: ఆ చర్యలు తీసుకోకుండా.. రఫాపై దాడులొద్దు! ఇజ్రాయెల్‌కు బైడెన్‌ హెచ్చరిక

పౌరులను కాపాడేందుకు సరైన ప్రణాళిక లేకుండా గాజాలోని రఫాలో సైనిక చర్యకు ముందుకెళ్లొద్దని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు.

Published : 16 Feb 2024 22:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దక్షిణ గాజాలోని రఫా (Rafah) నగరంలో భూతల దాడులకు ఇజ్రాయెల్‌ (Israel) సమాయత్తమవుతోంది. అయితే.. గాజా (Gaza) జనాభాలో సగానికిపైగా పౌరులు ప్రస్తుతం ఇక్కడే తలదాచుకుంటున్నారు. ఈ ప్రాంతంలో దాడులు మొదలైతే మరింత దారుణ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌరులను కాపాడేందుకు సరైన ప్రణాళిక లేకుండా రఫాలో సైనిక చర్యకు దిగొద్దని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు.

పాలస్తీనాతో దీర్ఘకాలిక వివాదంపై అంతర్జాతీయ పరిష్కార మార్గాలను తిరస్కరిస్తున్నట్లు నెతన్యాహు శుక్రవారం స్పష్టం చేశారు. ఎటువంటి ముందస్తు షరతుల్లేని చర్చల ద్వారానే సమస్య కొలిక్కి వస్తుందని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. స్వతంత్ర పాలస్తీనాను గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. లేకపోతే ఉగ్రసంస్థ ‘హమాస్‌’కు ఇది భారీ బహుమతి అవుతుందని చెప్పారు.

పుతిన్‌ ప్రత్యర్థి నావల్నీ జైలులో మృతి..!

దక్షిణ ఇజ్రాయెల్‌ అష్‌దోడ్‌లో ఓ పాలస్తీనా వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు స్థానికులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఓ పౌరుడి చేతిలో అతడు హతమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు నెతన్యాహు సంతాపం ప్రకటించారు. దాడులు చేసేవారు కేవలం గాజా నుంచి వస్తారనేది తప్పని ఈ ఘటన గుర్తుచేస్తుందన్నారు. మరోవైపు, టెల్‌అవీవ్‌ దాడులతో రఫాలోని పాలస్తీనా పౌరులు తమ భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఈజిప్టు ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే గాజా సరిహద్దుకు సమీపంలో షేక్ జువైద్- రఫా రోడ్డు వెంబడి ఓ ప్రహరీ నిర్మాణం చేపడుతున్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో తెలుస్తోందని ఓ వార్తా సంస్థ తెలిపింది. రహదారి పొడవునా క్రేన్‌లు, ట్రక్కులు, కాంక్రీట్ అడ్డంకులు కనిపిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని