Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ ముఖాన్ని బ్లర్‌ చేసి, ప్రసారం.. మీడియా ఛానెల్‌పై తీవ్ర విమర్శలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్(Pakistan) తన దేశంలో తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. వాటిలో భాగంగా తాజాగా ఓ మీడియా ఛానెల్ ఆయన ముఖాన్ని బ్లర్‌ చేసి ప్రసారం చేసింది. 

Updated : 08 Jul 2023 18:29 IST

ఇస్లామాబాద్: పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan) దృశ్యాలను బ్లర్‌ చేసి, ప్రసారం చేయడంతో పాకిస్థాన్‌(Pakistan) మీడియా సంస్థ ఒకటి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఐఎంఎఫ్ ప్రతినిధులతో జరిగిన సమావేశం ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా ఇమ్రాన్‌ ముఖాన్ని కనిపించకుండా చేసింది. అదే కార్యక్రమంలో ఉన్న ఐఎంఎఫ్ ప్రతినిధి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ మాత్రం టీవీ ప్రసారంలో స్పష్టంగా కనిపించారు.

దాంతో Channel ARYపై పీటీఐ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటు చర్య అని మండిపడ్డారు. అలాగే సదరు ఛానెల్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ‘Channel ARY.. ఇమ్రాన్‌ వల్లే పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఆయనపైనే దాడి చేస్తోంది. వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఆ ఛానెల్‌ను బాయ్‌కాట్ చేయండి’ అని పీటీఐ కార్యకర్త ఒకరు ట్విటర్‌లో విమర్శలు చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఒరిజినల్‌ ఫుటేజ్‌, ఛానల్‌లో ప్రసారం చేసిన బ్లర్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ పాక్ ప్రభుత్వంపై, మీడియా సంస్థపై పీటీఐ నేతలు మండిపడుతున్నారు.

పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన పార్టీపై కఠినచర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వాటిలో భాగంగా అన్ని ప్రధాన మీడియా సంస్థల ప్రసారాల్లో ఇమ్రాన్‌ కనిపించకుండా, ఆయన పేరును ప్రచురించకుండా నిషేధం విధించింది. మే 9న ఇమ్రాన్‌ అరెస్టు తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆగ్రహించిన పాక్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ అక్కడి మీడియా సంస్థలకు.. ఇమ్రాన్‌ పేరు ప్రస్తావించకూడదని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఆదేశాలనే సదరు మీడియా సంస్థ పాటించినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌ (Pakistan)కు ఇటీవల భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 3 బిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్‌తో కీలక ఒప్పందం జరిగింది. దీనికి ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. దీనిని బోర్డు త్వరలో పరిశీలించవచ్చని ఐఎంఎఫ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని