Pak poll results: పాక్‌ ఎన్నికల్లో ఇమ్రాన్‌ ‘అభ్యర్థుల’ హవా?

Pak poll results: పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని.. ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నికల కమిషన్‌ కుట్ర పన్నుతోందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Updated : 09 Feb 2024 11:46 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఎన్నికల ఫలితాలు (Pak Poll Results) వెల్లడవుతున్నాయి. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌’ (PTI) పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పీటీఐ వర్గాలు సైతం అదే విషయాన్ని చెబుతున్నాయి. ఇప్పటి వరకు పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం మాత్రం ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌ సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పార్టీకి చెందిన మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ గెలుపొందటం గమనార్హం. 

పాకిస్థాన్‌లో గురువారం సాయంత్రం ఎన్నికలు ముగిశాయి. కాసేపటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని (Pak Poll Results) ప్రకటించారు. ఆ తర్వాత ఫలితాల వెల్లడిని నిలిపివేశారు. తిరిగి శుక్రవారం ఉదయం ప్రకటించడం ప్రారంభించారు. అంతకుముందు ‘ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (ECP)’ కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందని పీటీఐ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో తమ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలుపొందారని ఇమ్రాన్‌ ప్రకటించారు. ఎన్నికల అధికారులు ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు జాప్యంపై పాక్‌ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్‌ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తెలిపింది.

తొలి ఫలితంలో (Pak Poll Results) పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్‌ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్‌ ఇక్బాల్‌ మీడియాకు వెల్లడించారు. కైబర్‌ పంఖ్తుంక్వా ప్రావిన్సియల్‌ అసెంబ్లీకి చెందిన పీకే-76 స్థానంలో గెలిచినట్లు తెలిపారు. పీకే-6లోనూ పీటీఐ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి ఫజల్‌ హకీమ్‌ ఖాన్‌ విజయం సాధించినట్లు పేర్కొన్నారు. స్వాట్‌లోని పీకే-4 నియోజకవర్గంలోనూ పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి అలీ షా గెలుపొందినట్లు ప్రకటించారు.

తమ గెలుపును ఆపేందుకు ఈసీపీ కుట్ర పన్నుతోందంటూ పీటీఐ చేసిన ఆరోపణలను జాఫర్‌ ఇక్బాల్‌ ఖండించారు. ఓట్ల లెక్కింపులో ఆలస్యం వల్లే ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఈసీపీకి వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. శుక్రవారం ఉదయానికి ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. మరోవైపు తమ పార్టీ 150 నేషనల్‌ అసెంబ్లీ స్థానాలకు పైగా గెలుపొందినట్లు పీటీఐ ఛైర్మన్‌ గోహర్‌ ఖాన్‌ ప్రకటించుకున్నారు. పంజాబ్‌, కైబర్‌ ఫంఖ్తుంక్వాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉందన్నారు. వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించాలని ఈసీపీకి విజ్ఞప్తి చేశారు.

ఓటింగ్‌ ప్రారంభానికి ముందు గురువారం ఉదయం 8 గంటల నుంచి పాక్‌ కేర్‌టేకర్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటిని ఇంకా పునరుద్ధరించకపోవడం గమనార్హం. ప్రస్తుతం మిలిటరీ మద్దతున్న పీఎంఎల్‌-ఎన్‌ అధినేత నవాజ్‌ షరీఫ్‌ ఓడినట్లు పార్టీకి చెందిన ఓ కీలక వ్యక్తిని ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. దీంతో ఆయన వెంటనే కూతురు మరియం నవాజ్‌, సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌తో కలిసి పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.

జైల్లో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ పీటీఐ అధికారిక చిహ్నం క్రికెట్‌ బ్యాట్‌ను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకూ అనుమతి నిరాకరించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా బరిలోకి దిగారు. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని