Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు పాక్‌ సుప్రీంకోర్టు ఝలక్‌!

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆ దేశ సుప్రీం కోర్టు గట్టి ఝలక్‌ ఇచ్చింది. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ....

Updated : 07 Apr 2022 22:08 IST

ఏప్రిల్‌ 9న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌కు సుప్రీంకోర్టు గురువారం గట్టి ఝలక్‌ ఇచ్చింది. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. అవిశ్వాస తీర్మానం తోసిపుచ్చడం సరికాదని స్పష్టంచేసింది. అవిశ్వాస తీర్మానం తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ఐదుగురు సభ్యులతో కూడిన పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం రాత్రి ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. అలాగే, పాకిస్థాన్‌ దిగువ సభను రద్దు చేస్తూ పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలకు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు.. ఇమ్రాన్‌ అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్‌ 9న ఓటింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది.

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ మార్చి 8న ప్రతిపక్ష పార్టీలకు చెందిన వంద మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ‘అవిశ్వాసం’ ఆటలో ఆఖరి బంతి వరకూ పోరాడతానంటూ చెప్పుకొచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌కు చివరకు సుప్రీంకోర్టులో ఓటమి తప్పలేదు. తనపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో ఆదివారం చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమంటూ డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించారు. ఆ వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ దేశాధ్యక్షుడికి ఇమ్రాన్‌ సిఫార్సు చేయడం, దానికి అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయం, ప్రధాని సిఫార్సుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై తాజాగా మరోసారి విచారణ జరిపిన పాకిస్థాన్‌ సర్వోన్నత న్యాయస్థానం డిప్యూటీ స్పీకర్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఇమ్రాన్‌ ఖాన్‌ అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని