Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్‌ హుకుం!

లక్షల మంది అఫ్గానీయులు (Afghans) తక్షణమే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని పాకిస్థాన్‌ (Pakistan) ఆదేశాలు జారీ చేసింది.

Updated : 04 Oct 2023 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ (Afghanistan) నుంచి శరణు కోరి వచ్చే వారిపై పాకిస్థాన్‌ (Pakistan) కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా వచ్చిన వారు తక్షణమే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేదంటే తరిమివేస్తామని హెచ్చరించింది. ఇలా అఫ్గాన్‌ నుంచి శరణార్థులుగా (Refugees) వచ్చిన వారు దాదాపు 17లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. వీరందర్నీ దేశం నుంచి పంపించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అఫ్గాన్‌ను 2021లో తాలిబాన్‌లు ఆక్రమించుకున్న తర్వాత అనేక మంది పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చారు. ఐరాస నివేదిక ప్రకారం.. దాదాపు 13లక్షల మంది అఫ్గాన్‌ పౌరులు శరణార్థులుగా రిజిస్టర్‌ చేసుకున్నారు. మరో 8.8లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. మరో 17లక్షల మంది అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారని పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్‌ బుగిటి ఇటీవల పేర్కొన్నారు. అక్రమంగా వచ్చినవారంతా నవంబర్‌ 1నాటికి తమ దేశం విడిచి పోవాలని ఆదేశించారు. లేదంటే భద్రతా బలగాల సహాయంతో వారిని గుర్తించి.. బలవంతంగా బహిష్కరిస్తామన్నారు. నవంబర్‌ తర్వాత పాస్‌పోర్టు లేదా వీసా లేకుండా దేశంలోకి ఎవరినీ అనుమతించమన్నారు. పాకిస్థాన్‌ పౌరులు కాకున్నా.. ఐడీ కార్డులున్న వారి జాతీయతను గుర్తించేందుకు డీఎన్‌ఏ టెస్టింగ్‌నూ ఉపయోగిస్తామని పాక్‌ మంత్రి సర్ఫరాజ్‌ స్పష్టం చేశారు.

సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!

తమ దేశంలో ఉన్న అఫ్గాన్‌ వాసులందర్నీ బయటకు పంపించాలని పాకిస్థాన్‌ కోరుకుంటున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెలువడ్డాయి. అధికారికంగా అనుమతి పొందిన వారిని కూడా పంపించే ప్రయత్నం చేస్తోందని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఇప్పటికే వందల మందిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం కూడా పేర్కొంది.

మరోవైపు, బలూచిస్థాన్‌ ప్రావిన్సులో పాకిస్థానీ తాలిబాన్‌ (టీటీపీ), ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు మధ్య తరచూ దాడులు జరుగుతూనే ఉంటాయి. కొంతకాలంగా ఈ మిలిటెంట్‌ దాడులతో అక్కడి సరిహద్దులు మారుమోగుతున్నాయి. పాక్‌ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 24 ఆత్మాహుతి దాడులు జరగగా..అందులో 14 దాడుల్లో అఫ్గాన్‌ పౌరులే ఉన్నారట. ఈ క్రమంలో అఫ్గాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలే తమ ప్రదేశంలోకి చొరబడి దాడులు చేస్తున్నాయంటూ పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది. అటు తాలిబాన్‌ నేతృత్వంలోని అఫ్గాన్‌ మాత్రం వాటిని తిప్పికొడుతోంది. పాక్‌ సరిహద్దులోని మాస్తాంగ్‌ నగరంలోని ఓ మసీదులో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని