Bangladesh: బంగ్లాదేశ్‌ పీఠంపై మరోసారి షేక్‌ హసీనా.. ఎన్నికల్లో అవామీ లీగ్‌ మెజారిటీ

బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి విజయం సాధించింది. ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. 

Updated : 08 Jan 2024 05:51 IST

ఢాకా: బంగ్లాదేశ్‌(Bangladesh) సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina) నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీకి మెజారిటీ లభించింది. ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ సహా దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ దూరంగా ఉన్నవేళ అవామీ లీగ్‌ మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 300 సీట్లలో 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్‌ 200సీట్లను కైవసం చేసుకొని వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. గోపాల్‌గంజ్‌-3 నుంచి పోటీ చేసిన ప్రధాని హసీనా 2,49,965 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్‌ లష్కర్‌కు కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1986 నుంచి ఈ స్థానంలో షేక్‌ హసీనా వరుసగా ఎనిమిదో సారి గెలవడం గమనార్హం.  

ఈ విజయంతో 76 ఏళ్ల షేక్‌ హసీనా వరుసగా నాలుగోసారి, మొత్తంగా ఐదోసారి ప్రధాని పీఠం అధిరోహించనున్నారు. ఎన్నికలను నిరసిస్తూ నిరసనలు, ఘర్షణ వాతావరణ నెలకొన్న ఏకపక్ష ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. అధికారుల అంచనా ప్రకారం మొత్తం 40 శాతం పోలింగ్‌ నమోదైంది. పూర్తి ఫలితాల తర్వాత ఈ శాతం మారే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. 2018 జనరల్‌ ఎన్నికల్లో మొత్తం 80 శాతం పోలింగ్‌ నమోదైంది. అవామీ లీగ్‌ విజయంపై ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ ఒబైదుల్‌ ఖాదర్‌ ఆనందం వ్యక్తం చేశారు. బీఎన్‌పీ, జమాత్‌- ఇ- ఇస్లామీ ఇచ్చిన ఎన్నికల బహిష్కరణను ప్రజలు వ్యతిరేకించి ఓట్లు వేశారని అన్నారు.

ఆదివారం సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరగగా, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎవరు గెలిచారో స్పష్టత వచ్చినప్పటికీ పూర్తిస్థాయి లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే వచ్చిన ఫలితాల నేపథ్యంలో అవామీ లీగ్‌ మెజారిటీ సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రతినిధి తెలిపారు. అయితే కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 చోట్లు దాడులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని