Ukraine Crisis: 18,600 మంది రష్యా సైనికులు మృతి.. ఉక్రెయిన్‌ జెండాను ముద్దాడిన పోప్‌!

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నెలన్నరకు పైగా కొనసాగుతూనే ఉంది. రష్యా- ఉక్రెయిన్‌ భీకర పోరులో ఇరువైపులా.....

Published : 07 Apr 2022 01:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నెలన్నరకు పైగా కొనసాగుతూనే ఉంది. రష్యా- ఉక్రెయిన్‌ భీకర పోరులో ఇరువైపులా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు కోటి మంది జనం తమ ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పొరుగు దేశాలకు పారిపోతున్న దయనీయ పరిస్థితులు ఉక్రెయిన్‌లో నెలకొన్నాయి. రష్యా సేనల అరాచకత్వానికి అనేకమంది మహిళలు, బాలికలు బతుకులు ఛిద్రంగా మారుతున్నాయి. బుచా నగరంలో పుతిన్‌ సేనల మారణహోమాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ విషాద ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు మద్దతిస్తున్నట్టు భారత్‌ తెలపగా.. దీనిపై విచారణ జరపాలని చైనా కోరింది. 

  1. రష్యా దళాల దాడుల్ని ఉక్రెయిన్‌ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటివరకు 18,600 మందికి పైగా రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించుకుంది. అలాగే, 150 విమానాలు, 135 హెలికాప్టర్లు, 684 యుద్ధ ట్యాంకులు, 1861 సాయుధ శకటాలతో పాటు భారీ సంఖ్యలో యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసి రష్యాను ఘోరంగా దెబ్బతీసినట్టు పేర్కొన్నాయి.
  2. ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్ర మొదలైనప్పట్నుంచి ఇప్పటిదాకా దాదాపు కోటి మందికి పైగా పౌరులు భయంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. ఇప్పటివరకు 10 మిలియన్ల మంది తమ ఇళ్లు విడిచి ఉక్రెయిన్‌లోని  ఇతర నగరాలకు, పొరుగు దేశాలకు వలస వెళ్లి ఆశ్రయం పొందినట్టు  ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది.
  3. పుతిన్‌ సేనలు బుచా పట్టణంలో దాదాపు 320 మంది పౌరుల్ని చంపినట్టు ఆ ప్రాంత మేయర్‌ అనటోలై ఫెడ్రుక్‌ తెలిపారు. బుచాలోని పౌరుల్ని రష్యా సైనికులు చంపడం తాను కళ్లారా చూసినట్టు ఏప్రిల్‌ 5న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
  4. ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో రష్యా సేనల దాడుల్లో ధ్వంసమైన ఉక్రెయిన్‌ జెండాను పోప్‌ ఫ్రాన్సిస్‌ ముద్దాడారు. వాటికెన్‌ సిటీలో ఆయన వద్దకు వచ్చిన ఆరుగురు ఉక్రెయిన్‌ చిన్నారులను ఆయన ఆహ్వానించారు. వారు తీసుకొచ్చిన జాతీయ పతాకాన్ని ముద్దాడుతూ యుద్ధాన్ని ముగించాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆ చిన్నారులకు ఓ పెద్ద చాక్లెట్ ఈస్టర్ గుడ్డు ఇచ్చారు. ఉక్రెయిన్‌ పౌరులందరి కోసం ప్రార్థనలు చేయాలని పోప్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 
  5. ఉక్రెయిన్‌లోని బుచా పట్టణంలో జరిగిన మారణ హోమాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు మద్దతు ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. రక్తం  చిందించడం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం దొరకదన్నారు. అలాగే ఉక్రెయిన్‌ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియ పైనా మాట్లాడారు.  భారత్‌ ఒక వైపు నిలవాల్సి వస్తే.. అది కచ్చితంగా శాంతి పక్షమేనని స్పష్టంచేశారు. అలాగే తక్షణం హింస ముగింపు కోసమే చూస్తోందన్నారు. ఇదే మన దేశ విధానం.. దీన్ని పలు అంతర్జాతీయ వేదికలపైనా స్పష్టంచేశామని తెలిపారు.
  6. రష్యా సేనల దాడులతో ఉక్రెయిన్‌లోని బుచా పట్టణంలో మారణహోమంపై వస్తున్న వార్తలు, చిత్రాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని చైనా పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. మానవతా సంక్షోభాన్ని నివారించేందుకు అనుకూలమైన అన్ని చర్యలకు చైనా మద్దతుగా నిలుస్తుందనీ.. పౌరులకు హాని చేసే ఎలాంటి చర్యలనైనా నిరోధించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
  7. తమ దేశంపై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యాపై యూరోపియన్‌ యూనియన్‌ ఐదో దశ ఆంక్షల ప్యాకేజీపై ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ప్రశంసలు కురిపించారు. రష్యా బొగ్గు, ఈయూ పోర్టుల్లోకి నౌకలు, రోడ్డు రవాణా ఆపరేషన్లపై నిషేధం పెట్టడం మంచి పరిణామమన్నారు. పుతిన్‌ను నిలువరించేందుకు గ్యాస్‌/చమురుపై ఆంక్షలతో పాటు రష్యాకు చెందిన బ్యాంకులన్నింటినీ స్విఫ్ట్‌ నుంచి తొలగించాలన్నారు. కఠిన సమయాల్లో తీవ్ర నిర్ణయాలు అవసరమని పేర్కొన్నారు. 
  8. ఆకలినే ఆయుధంగా మలచుకొని రష్యా ఉద్దేశపూర్వకంగానే ఆహార సంక్షోభాన్ని రెచ్చగొడుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా దండయాత్ర మొదలైనప్పట్నుంచి ఇప్పటివరకు కనీసం 167 మంది చిన్నారులు మృతిచెందినట్టు వెల్లడించారు. రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షల్లో అనిశ్చితిని తాము సహించబోమని వ్యాఖ్యానించారు.
  9. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్‌ ప్రాంతంలోని వుహ్లేదర్‌ పట్టణంలో మానవతా సహాయం పంపిణీ కేంద్రంపై రష్యా బలగాలు జరిపిన కాల్పుల్లో కనీసం ఇద్దరు పౌరులు మృతిచెందినట్టు ఆ ప్రాంత గవర్నర్‌ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడినట్టు వెల్లడించారు.
  10. ఉక్రెయిన్‌లోని రుబిజెహ్నె పట్టణాన్ని 60శాతం రష్యా బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయని లుహాన్స్క్‌ గవర్నర్‌ వెల్లడించారు. మరోవైపు, రష్యాకు చెందిన 12 మంది దౌత్య సిబ్బందిని గ్రీస్‌ బహిష్కరించినట్టు గ్రీక్‌ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు.
Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని