Nepal PM: ‘నన్ను పీఎం చేసేందుకు గతంలో భారత వ్యాపారి ప్రయత్నం’.. నేపాల్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

ఓ భారత వ్యాపారి గురించి నేపాల్‌ ప్రధాని (Nepal PM) చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో వేడిని రాజేశాయి. దీంతో ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

Updated : 06 Jul 2023 18:23 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌ ప్రధానమంత్రి పుష్ప కుమార్‌ దహల్‌ ప్రచండ వివాదంలో చిక్కుకున్నారు. తనను ప్రధానిని చేసేందుకు నేపాల్‌లో స్థిరపడిన ఓ భారత వ్యాపారి గతంలో సాయం చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హిమాలయ దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రచండ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నాయి. అసలేం జరిగిందంటే..

కాఠ్‌మాండూలో స్థిరపడిన ప్రముఖ భారత వ్యాపారవేత్త సర్దార్‌ ప్రీతమ్‌ సింగ్‌ జీవితకథపై రచించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని ప్రచండ మాట్లాడుతూ.. ‘‘నేపాల్‌-భారత్‌ బంధాన్ని బలోపేతం చేయడంలో సర్దార్‌ ప్రీతమ్‌ సింగ్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ఓసారి నన్ను ప్రధానిగా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనేకసార్లు దిల్లీ వెళ్లారు. కాఠ్‌మాండూలోని రాజకీయ నేతలతో పలు మార్లు చర్చలు జరిపారు’’ అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు కాస్తా నేపాల్‌ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని ప్రచండ రాజీనామా చేయాలని పలు విపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యూఎంఎల్‌) ఛైర్మన్‌, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలపై ప్రచండ కేవలం వివరణ ఇస్తే సరిపోదని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని అన్నారు. ‘‘ఆయన వ్యాఖ్యలు దేశ స్వతంత్రత, మర్యాదకు భంగం కలిగించాయి. రాజ్యాంగం, దేశ పార్లమెంట్‌ను అవమానించేలా ఉన్నాయి’’ అని ఓలీ దుయ్యబట్టారు. విపక్షాలే కాదు.. సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నేతలు కూడా ప్రచండ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాగా.. ఈ వివాదంపై ప్రధాని ప్రచండ స్పందించారు. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి వివాదం రేపుతున్నారని ఆరోపించారు. పుస్తకంలో ప్రీతమ్‌ సింగ్‌ చెప్పిన వ్యాఖ్యలనే తాను చెప్పానని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని