Maldives: మరింతమంది పర్యాటకులను పంపండి.. చైనాకు మాల్దీవుల అధ్యక్షుడి విజ్ఞప్తి!

మాల్దీవులకు మరింతమంది పర్యాటకులను పంపించాలని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు మంగళవారం చైనాకు విజ్ఞప్తి చేశారు.

Updated : 11 Jan 2024 13:36 IST

బీజింగ్‌: తమ దేశానికి మరింత మంది పర్యాటకులను పంపించాలని మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) చైనాకు విజ్ఞప్తి చేశారు. ఆ దేశం (China)లో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఫుజియాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. డ్రాగన్‌ను తమ సన్నిహిత మిత్రదేశాల్లో, అభివృద్ధి భాగస్వాముల్లో ఒకటిగా పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీ, లక్షద్వీప్‌ పరిసరాలపై.. మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

చైనా అధినేత జిన్‌పింగ్ ప్రారంభించిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)’ను ముయిజ్జు మరోసారి ప్రశంసించారు. తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించిందని చెప్పారు. మాల్దీవులకు చైనా పర్యాటకుల సంఖ్య పెంచాలని కోరారు. ‘‘కొవిడ్‌కు ముందు మాకు చైనా నంబర్ వన్ మార్కెట్‌. ఈ స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి’’ అని అభ్యర్థించారు. మాల్దీవుల్లో సమీకృత పర్యాటక జోన్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు దేశాలు 50 మిలియన్ల డాలర్ల ప్రాజెక్ట్‌పై సంతకం చేశాయని స్థానిక మీడియా తెలిపింది.

మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో భారత్‌ నుంచే ఎక్కువగా ఉంటున్నట్లు తాజా గణాంకాల్లో తేలింది. గత మూడేళ్లుగా ఏటా 2లక్షల మంది భారతీయులు ఆ దేశానికి వెళ్తున్నట్లు వెల్లడైంది. 2023లో 17 లక్షల మంది ఆ దీవులను సందర్శించారు. వీరిలో 2,09,198 లక్షల మంది భారత్‌ నుంచి రాగా.. 1,87,118 మంది చైనీయులు ఉన్నారు. తాజా వివాదంతో భారత్‌ నుంచి ఆ దీవులకు పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ చైనాలో ముయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు