jail: శిక్ష పూర్తయినా జైల్లోనే.. అమెరికా బాటలో సింగపూర్‌

శిక్షాకాలం పూర్తయినప్పటికీ, నేరస్తుల నుంచి సమాజానికి ప్రమాదం పొంచిఉంటే వారిని జైల్లోనే కొనసాగించేలా సింగపూర్‌ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

Published : 06 Feb 2024 01:35 IST

సింగపూర్‌: దేశంలో నేరాలను నియంత్రించేందుకు సింగపూర్‌ (Singapore) ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని (Singapore Govt New Law) తీసుకొచ్చింది. దీని ప్రకారం శిక్షాకాలం పూర్తయినా, ఆ నేరస్తుల నుంచి సమాజానికి ప్రమాదం పొంచిఉందని ప్రభుత్వం భావిస్తే వారిని జైల్లోనే ఉంచేందుకు అవకాశం ఏర్పడుతుంది. 21 ఏళ్లు పైబడినవారే చట్టం పరిధిలోకి వస్తారు. సాధారణంగా కోర్టు విధించిన శిక్ష పూర్తయిన తర్వాత.. జైలు అధికారులు వారిని విడుదల చేస్తుంటారు. కానీ, ఇకపై హత్యలు, చిన్నారులపై అత్యాచారం తదితర కేసుల్లోని నేరస్తులను విడుదల చేసే ముందు న్యాయ, హోం మంత్రి అనుమతి అవసరం. వారు విడుదలైన తర్వాత మళ్లీ అదేతరహా నేరాలు చేసేందుకు అవకాశం ఉందని భావిస్తే.. జైలు నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించదు.

ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంగా న్యాయ, హోంశాఖ మంత్రి షణ్ముగం మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఓ సంఘటనను ప్రస్తావించారు. ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం కేసులో జైలు కెళ్లిన ఓ వ్యక్తి శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత 2015, 2017లో మళ్లీ ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వారిద్దరూ నిందితుడి సోదరి మనవరాళ్లే. ఇలాంటి ఘోరమైన ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈతరహా కేసుల్లో నేరస్తులను విడుదల చేయాలా? వద్దా? అని నిర్ణయించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి వివరించారు. మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, మానసిక నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారన్నారు. ఒకవేళ విడుదల చేసేందుకు కమిటీ నిరాకరిస్తే.. ప్రతి ఏడాదీ ఆ నేరస్తుడి నడవడికను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

ఈతరహా చట్టం అగ్రరాజ్యం అమెరికాలోనూ అమల్లో ఉంది. అయితే, మొత్తం 50 రాష్ట్రాలకు గానూ 20 రాష్ట్రాలు, కొలంబియా జిల్లా పరిధిలోని నేరస్తులకు మాత్రమే ఈ చట్టాన్ని వర్తింపజేస్తున్నారు. సింగపూర్‌ తాజాగా తీసుకొచ్చిన ఈ చట్టానికి విపక్షాలు కూడా మద్దతు పలికాయి. అయితే, దీనిద్వారా నేరాలను అరికట్టడం అంత సులభమేమీ కాదని, ఉద్దేశపూర్వకంగానే నేరస్తుల శిక్షా కాలాన్ని పెంచే అవకాశముందని అభిప్రాయపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని