Artemis I: ఇయాన్‌ ప్రభావంతో ఆర్టెమిస్‌-1 ప్రయోగం మరింత జాప్యం..!

నాసా ప్రయోగించ తలపెట్టిన అతి శక్తివంతమైన రాకెట్‌ ఆర్టెమిస్‌-1కు ఇప్పటికీ సమస్యలు తొలగినట్లు లేవు. మంగళవారం జరగవచ్చని భావిస్తున్న ఈ ప్రయోగం ఇయాన్‌ హరికేన్‌ కారణంగా మరోసారి జాప్యమయ్యే అవకాశం ఉంది.

Published : 26 Sep 2022 02:10 IST

ఇంటర్నె్ట్‌డెస్క్‌: నాసా ప్రయోగించ తలపెట్టిన అతి శక్తివంతమైన రాకెట్‌ ఆర్టెమిస్‌-1కు ఇప్పటికీ సమస్యలు తొలగినట్లు లేవు. మంగళవారం జరగవచ్చని భావిస్తున్న ఈ ప్రయోగంలో ఇయాన్‌ హరికేన్‌ కారణంగా మరోసారి జాప్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తుపానుగా మొదలైన ఇయాన్‌ వచ్చేవారానికి మరింత బలపడి హరికేన్‌గా మారవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు సమస్యలతో ఇప్పటికే ఆర్టెమిస్‌ ప్రయోగం రెండుసార్లు వాయిదా పడింది. 

ఆగస్టులో జరగాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాల వల్ల ఒక సారి వాయిదా పడింది. సెప్టెంబర్‌లో  రెండోసారి ప్రయత్నించగా.. ఇంధన లీకేజీ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి దీనిని వాయిదా వేశారు. తాజాగా ఇయాన్‌ తుపాను రావడంతో శాస్త్రవేత్తలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటి వరకు ప్రయోగ వేదిక వద్దే ఉంచి మరమ్మతులు చేశారు. కానీ, దీనిని తిరిగి అసెంబ్లింగ్‌ సైట్‌కు తరలించే విషయంపై ఆదివారం ఓ నిర్ణయం తీసుకోనున్నారు.  

 చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టులో భాగమే ఆర్టెమిస్‌ 1. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) చేపట్టిన ఈ యాత్రలో శక్తిమంతమైన రాకెట్‌తోసహా వ్యోమనౌకలను నింగిలోకి పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో మాదిరిగా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే, ప్రస్తుతం మాత్రం అందులో ఉన్న ఓరియన్‌ క్యాప్సూల్‌ మానవరహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రానుంది. 2024లో ఆర్టెమిస్‌-2, 2025లో ఆర్టెమిస్‌-3 ప్రయోగాలను నాసా చేపట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని