Karachi Blast: చైనీయుల ప్రతి రక్తపు బొట్టుకూ ప్రతీకారం తీర్చుకుంటాం..

పాకిస్థాన్‌లోని కరాచీ యూనివర్శిటీలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని డ్రాగన్‌ తీవ్రంగా ఖండించింది. చైనీయులు చిందించిన ప్రతి రక్తపు బొట్టునూ వృథా కానివ్వమని, ఈ ఘటన వెనుక బాధ్యులు

Updated : 27 Apr 2022 13:12 IST

కరాచీ పేలుడుపై డ్రాగన్‌ హెచ్చరిక

బీజింగ్‌: పాకిస్థాన్‌లోని కరాచీ విశ్వవిద్యాలయంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని డ్రాగన్‌ తీవ్రంగా ఖండించింది. చైనీయులు చిందించిన ప్రతి రక్తపు బొట్టునూ వృథా కానివ్వమని, ఈ ఘటన వెనుక బాధ్యులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చైనా విదేశాంగ శాఖ హెచ్చరించింది. తమ దేశీయులకు మరింత భద్రత కల్పించాలని ఈ సందర్భంగా పాక్‌ను డిమాండ్‌ చేసింది.

కరాచీ యూనివర్సిటీలో స్థానిక విద్యార్థులకు చైనీస్‌ భాషను బోధించే కన్ఫూసియస్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. బుర్ఖా ధరించిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చైనీస్‌ టీచర్లు, పాక్‌కు చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ మృతిచెందారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వు జియాంగావో.. చైనాలోని పాక్‌ రాయబారికి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పాక్‌ను డిమాండ్‌ చేసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి వెల్లడించారు. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో నివసిస్తోన్న చైనీయులకు మరింత భద్రత కల్పించాలని కోరినట్లు తెలిపారు.

ఈ దాడి తమ పనేనని నిషేధిత బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. ఘటన అనంతరం బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. ‘‘బలూచిస్థాన్‌ నుంచి పాక్‌, చైనా వెంటనే వెళ్లిపోవాలి. లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. చైనీయులపై దాడి కోసం ప్రత్యేక యూనిట్‌నే ఏర్పాటు చేశాం’’ అని తుపాకీ పట్టుకున్న ఓ వ్యక్తి ఆ వీడియోలో హెచ్చరించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌ సరిహద్దులుగా ఉన్న బలూచిస్థాన్‌లో చైనా-పాకిస్థాన్‌ ఎకానమిక్‌ కారిడార్‌ కింద రెండు దేశాలు పలు ప్రాజెక్టులు చేపట్టాయి. అయితే ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోన్న బలూచ్‌ వేర్పాటు వాదుల బృందం.. గతంలోనే అనేక సార్లు చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. గతేడాది జులైలో కరాచీలో ఇద్దరు చైనీయులపై కాల్పులు జరిపి చంపేశారు. అదే నెలలో ఈశాన్య పాకిస్థాన్‌లో చైనా ఇంజినీర్లతో వెళ్తోన్న ఓ బస్సుపై దాడి చేయగా.. 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని