Donald Trump: ట్రంప్‌ మెడకు ‘టాయిలెట్‌’ వివాదం..!

కీలక పత్రాలను మాయం చేశారని ఆరోపిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కథనాలు వెలుబడడం కలవరం రేపుతోంది.

Updated : 11 Feb 2022 15:41 IST

కీలక పత్రాల మాయం చేశారనే ఆరోపణలతో కథనాలు

వాషింగ్టన్‌: కీలక పత్రాలను మాయం చేశారని ఆరోపిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కథనాలు వెలువడడం కలవరం రేపుతోంది. ముఖ్యంగా ఆయన పదవిలో ఉన్న సమయంలో అనేక కీలక పత్రాలను చింపివేసి వైట్‌హౌస్‌ టాయిలెట్‌లో పడేసి ఉండొచ్చన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సంబంధించి తాజాగా కథనాలు వెలువడడం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. అటువంటి నివేదికలు తప్పుదోవపట్టించేవేనని స్పష్టం చేశారు. ఆ ఆరోపణలు అవాస్తవమంటూ తోసిపుచ్చుతూ తాజాగా ఓ ప్రకటన చేశారు.

ట్రంప్‌ అధ్యక్ష పదవిని వీడిన తర్వాత ఆయన పాలనా కాలంలో కార్యకలాపాలకు సంబంధించి పలు ఇంటర్వ్యూలతో న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టర్‌ మాగీ హాబెర్‌మ్యాన్‌ ఓ పుస్తకం రాశారు. ట్రంప్‌ కార్యాలయంలోని టాయిలెట్‌లో పలుసార్లు పేపర్‌ ముక్కలు పేరుకుపోయినట్లు వైట్‌హౌస్‌ సిబ్బంది గుర్తించారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే, డొనాల్డ్‌ ట్రంప్‌ చింపివేసిన పత్రాలు టాయిలెట్‌లో వేసి ఫ్లష్‌ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చనే అనుమానానికి అవి ఆజ్యం పోశాయని అందులో వెల్లడించారు. త్వరలోనే విడుదల కానున్న ఆ పుస్తకంలోని విషయాలను తొలుత యాక్సియోస్‌ అనే వెబ్‌సైట్‌ ప్రచురించింది.

ట్రంప్‌కు అలవాటే..

అధ్యక్ష కార్యాలయానికి చెందిన పత్రాలను భద్రపరచడంలో డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారని గతంలోనూ విమర్శలు ఉన్నాయి. కీలక పత్రాన్ని చదివిన తర్వాత ముక్కలుగా చింపివేసే అలవాటు ఆయనకు ఉందని గతంలో ఓ నివేదిక వెల్లడించింది. 2018లో ఓసారి కీలక పత్రాన్ని చింపివేయగా.. వాటన్నింటిని సేకరించి టేప్‌తో అతికించి భద్రపరిచేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని ఆ నివేదిక పేర్కొంది. ఆ విషయం నిజమేనంటే నేషనల్‌ ఆర్కైవ్స్‌ గతవారం ధ్రువీకరించింది. అయితే, ఇటీవల వస్తున్న  ఆరోపణలపై నేషనల్‌ ఆర్కైవ్స్‌ దృష్టి సారించింది. ప్రభుత్వ పత్రాల నిర్వహణలో డొనాల్డ్‌ ట్రంప్‌ చట్టాలను ఉల్లంఘించినట్లు అనుమానిస్తూ.. అసలు ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో డాక్యుమెంట్ల నిర్వహణ ఏవిధంగా ఉందో పరిశీలించాలని అక్కడి న్యాయ విభాగానికి సూచించినట్లు ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెల్లడించింది.

కిమ్‌ ప్రేమలేఖలు..

కీలక పత్రాల విషయంలో ట్రంప్‌ అనుసరించిన తీరుపై ఇటీవలి కాలంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడా ఎస్టేట్‌ నుంచి కీలక డాక్యుమెంట్లతో కూడిన 15 డబ్బాలతోపాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి నేషనల్‌ ఆర్కైవ్స్‌ (NARA) ఇటీవల వెల్లడించింది. రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిన ట్రంప్‌.. వాషింగ్టన్‌ నుంచి వెళ్లిపోయే సమయంలో కొన్ని అధికారిక పత్రాలను ఆయన వెంట తీసుకువెళ్లినట్లు ధ్రువీకరించింది. వాటిలో ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోన్‌ ఉన్‌తో జరిగిన సంభాషణ పత్రాలతోపాటు అంతకుముందు అధ్యక్షుడిగా చేసిన బరాక్‌ ఒబామా నూతన అధ్యక్షుడికి రాసిన లేఖ కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే, కిమ్‌తో జరిపిన సంప్రదింపు లేఖలను ట్రంప్‌ అప్పట్లో ‘ప్రేమ లేఖలు’గా పేర్కొనేవారు.

అవి అవాస్తవం..

తాజాగా వచ్చిన ‘టాయిలెట్‌’ ఆరోపణలపై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ‘మరో ఫేక్‌ స్టోరీ’ అని చెప్పిన ఆయన.. చాలా వరకు కల్పిత అంశాలతో ఓ విలేకరి రూపొందించిన పుస్తకం ప్రచారం కోసమే ఈ ప్రయత్నం అంటూ ఓ ప్రకటన చేశారు. తానేమీ తప్పు చేయలేదన్న ట్రంప్‌.. మీడియాలో  వస్తున్న కథనాల్లోనూ వాస్తవం లేదన్నారు. NARAతో తన సంబంధాలను సరిగా లేవంటూ మీడియాలో వస్తున్నవి తప్పుడు వార్తలన్నారు. తన హయాంలో అధికారిక పత్రాలను భద్రపరచడంలో నేషనల్‌ అర్కైవ్స్‌తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానంటూ తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉండగా.. గతేడాది జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి పాల్పడిన ఘటనపై ప్రత్యేక కమిటీ దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే తాజా ఆరోపణలు రావడం ట్రంప్‌కు మరింత తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్యాపిటల్‌పై దాడి జరగడానికి ముందు, తర్వాత ఏం జరిగిందన్న విషయాలను తెలుసుకోవడంపై ఆ కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ ఘటన సమయంలో అధ్యక్ష హోదాలో ఉన్న ట్రంప్‌ కార్యకలాపాలకు సంబంధించిన కీలక పత్రాల గురించి నేషనల్‌ ఆర్కైవ్స్‌ను కమిటీ ఇది వరకే సంప్రదించింది. ఇలాంటి తరుణంలో పలు పత్రాలను ట్రంప్‌ మాయం చేశారనే ఆరోపణలు రావడం మాజీ అధ్యక్షుడికి మరింత సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని