Donald Trump: ‘లీకులు అందాయి.. నన్ను అరెస్టు చేస్తారు!’

ఓ కేసులో తనను మంగళవారం అరెస్టు చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిరసనలకు దిగాలంటూ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా అమెరికన్లకు పిలుపునివ్వడం గమనార్హం.

Updated : 18 Mar 2023 22:26 IST

వాషింగ్టన్‌: తమతో శారీరక సంబంధాలు నెరిపాడని ఆరోపించిన ఇద్దరు మహిళల నోరు మూయించేందుకుగానూ అమెరికా(America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) డబ్బు ముట్టజెప్పాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపడుతోన్న మాన్‌హాటన్ డిస్టిక్ అటార్నీ(Manhattan District Attorney) తనపై అభియోగాలు మోపేందుకు సిద్ధమవుతున్నారని.. ఈ క్రమంలో మంగళవారం తనను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ట్రంప్‌ తెలిపారు. తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌(Truth Social)’లో ఈ మేరకు పోస్ట్‌ పెట్టారు.

‘అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న రిపబ్లికన్‌ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడిని మంగళవారం అరెస్టు చేయనున్నారు. మాన్‌హాటన్ డిస్టిక్ అటార్నీ కార్యాలయం నుంచి ఈ మేరకు లీకులు అందాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘నిరసనలు చేపట్టండి. దేశాన్ని కాపాడండి!’ అని తన మద్దతుదారులకు పిలుపునివ్వడం గమనార్హం. 2021 జనవరిలో అమెరికా క్యాపిటల్‌ హిల్‌ వద్ద అల్లర్లకు ముందు సైతం ట్రంప్‌ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో న్యూయార్క్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ కేసులో ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్‌తో సహా పలువురు సాక్షులను అటార్నీ కార్యాలయం విచారించింది. ట్రంప్‌ ఆదేశాల మేరకు 2016లో ఇద్దరు మహిళలకు 2.80 లక్షల డాలర్ల చెల్లింపులు చేసినట్లు కోహెన్‌ చెప్పాడు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ఆ విషయాలను బయటకు పొక్కనీయకుండా డబ్బుతో ఒప్పందం చేసుకున్నారని తెలిపాడు. అయితే, ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని, తన 2024 అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రచారాన్ని నీరుగార్చేందుకు ‘డెమొక్రాటిక్’ ప్రాసిక్యూటర్ ద్వారా తప్పుడు విచారణ చేయిస్తోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని