Ukraine Crisis: ఆయుధాలు ఇవ్వండి.. ప్రాణాలు రక్షించుకుంటాం..!

సైనిక సహాయం చేయనప్పటికీ కనీసం ఆయుధాలనైనా ఇవ్వండంటూ నాటో (NATO) దేశాలను ఉక్రెయిన్‌ వేడుకుంటోంది.

Published : 08 Apr 2022 01:46 IST

నాటో దేశాలను వేడుకుంటోన్న ఉక్రెయిన్‌

బ్రసెల్స్‌: సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులకు పాల్పడుతున్నప్పటికీ.. ఉక్రెయిన్‌ మాత్రం ఎదురొడ్డి నిలుస్తోంది. ఆయుధ సామగ్రి, సైనిక బలం తక్కువగానే ఉన్నప్పటికీ నలభై రోజులుగా కొనసాగుతోన్న దురాక్రమణను దీటుగా ఎదుర్కొంటోంది. అయితే, బుచా వంటి మరిన్ని దారుణ ఘటనలను నిరోధించాలంటే తమకు మరిన్ని ఆయుధాలు అందించాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్‌ విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా సైనిక సహాయం చేయనప్పటికీ కనీసం ఆయుధాలనైనా ఇవ్వండంటూ నాటో (NATO) దేశాలను వేడుకుంటోంది.

ఉక్రెయిన్‌కు మద్దతు నిలిచే విషయంపై చర్చించేందుకు బ్రసెల్స్‌లో నాటో దేశాల విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో ఉక్రెయిన్‌ విదేశాంగశాఖ మంత్రి దిమైత్రో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటో దేశాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ‘మాకు ఎలా పోరాడాలో తెలుసు. ఎలా గెలవాలో తెలుసు. కానీ అవసరమైన ఆయుధాలు లేకుంటే విజయం కోసం అపారమైన త్యాగాలు చేయాల్సి వస్తుంది. అందుకే మేము కోరేది ఒక్కటే. ఆయుధాలు.. ఆయుధాలు.. ఆయుధాలు.. కావాలని అడుగుతున్నాం. ఎంత తొందరగా ఆయుధాలు ఉక్రెయిన్‌ చేరుకుంటే.. అంత ఎక్కువ మంది ప్రాణాలను రక్షించుకున్న వాళ్లమవుతాం’ అని ఉక్రెయిన్‌ విదేశాంగశాఖ మంత్రి దిమైత్రో కుబేలా పేర్కొన్నారు.

మాకు సమయం లేదు..

ఉక్రెయిన్‌పై రష్యా సేనలు మొదలుపెట్టిన సైనిక చర్యకుముందు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చేందుకు జర్మనీ నిరాకరించింది. కానీ, రష్యా సేనల దురాక్రమణ మొదలైన వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్న జర్మనీ.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, రక్షణసామగ్రి పంపించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో జర్మనీ మరెంతో సహాయం చేయగలదన్న ఉక్రెయిన్‌ విదేశాంగశాఖ మంత్రి దిమైత్రో, సాధ్యమైనంత తొందరగా అవి ఉక్రెయిన్‌కు చేరవేయాలని అభ్యర్థించారు. ఈ విషయంలో బెర్లిన్‌కు సమయం ఉండవచ్చేమో గాని కీవ్‌కు మాత్రం సమయం లేదన్నారు.

వీటిపై స్పందించిన జర్మనీ విదేశాంగమంత్రి అన్నాలెనా బేయర్‌బోక్‌.. ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు మద్దతు ఇచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను భాగస్వామ్య పక్షాలతో కలిసి పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌ అభ్యర్థనపై స్పందించిన నాటో జనరల్‌ సెక్రటరీ జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌.. ‘ఉక్రెయిన్‌ ఆత్మరక్షణ కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో తేలికపాటి యుద్ధ సామగ్రితోపాటు భారీ ఆయుధాలను కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంది’ అని ఉద్ఘాటించారు.

ఇదిలాఉంటే, సైనిక చర్యతో రష్యా దురాక్రమణకు పాల్పడుతున్నప్పటికీ నాటో దేశాలు మాత్రం వారి సైన్యాన్ని ఉక్రెయిన్‌కు పంపించేందుకు నిరాకరిస్తున్నాయి. కానీ, ఉక్రెయిన్‌కు మద్దతుగా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే ఆయుధాలతో పాటు వైద్య పరికరాల సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే, కేవలం ఈ సహాయం సరిపోవడం లేదని.. మరిన్ని ఆయుధాలు కావాలని ఉక్రెయిన్‌ అభ్యర్థిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని