Ukraine: ఘోరం.. ఇతడు అతడేనా..?

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఎన్నో హృదయవిదారక దృశ్యాలను కళ్లముందుంచింది.

Published : 28 Sep 2022 01:25 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఎన్నో హృదయవిదారక దృశ్యాలను కళ్లముందుంచింది. ఏడు నెలలు గడిచినా యుద్ధం కొనసాగుతుండడంతో.. ఎన్నో దయనీయ దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రష్యా చెర నుంచి విడుదలైన ఉక్రెయిన్ సైనికుల దుస్థితిని ఆ దేశం వెల్లడించింది. తీవ్ర గాయాలపాలై, అనారోగ్యంతో కుంగిపోయినప్పటికీ, రష్యా నుంచి బతికిబయటపడ్డాడంటూ మైఖైలో దియనోవ్‌ అనే సైనికుడి చిత్రాలను షేర్ చేసింది. అతడి మునుపటి, ప్రస్తుత చిత్రాలు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేస్తున్నాయి. 

‘రష్యా ఈ విధంగా జెనీవా ఒప్పందాలను కాలరాస్తోంది. ఈ విధంగా నాజీల వారసత్వాన్ని కొనసాగిస్తోంది’ అంటూ రష్యాపై ఉక్రెయిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరియుపోల్‌లోని అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకునే క్రమంలో దియనోవ్‌ రష్యా సైనికులకు చిక్కాడు. కాగా, గత బుధవారం విడుదలైన 205 మంది సైనికుల్లో ఇతడు కూడా ఉన్నాడు.

దియనోవ్‌కు సంబంధించి తాజా చిత్రంలో.. అతడు చాలా బలహీనంగా కన్పిస్తున్నాడు. ముఖం, చేతులపై గాయాల గుర్తులున్నాయి. ప్రస్తుతం కీవ్‌ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అతడి సోదరి అలోనా వెల్లడించారు.  రష్యా చెరలో అమానవీయ పరిస్థితుల కారణంగా చేతిలో కొంత ఎముకను కోల్పోయాడని చెప్పారు. తన సోదరుడు బరువు పెరిగే వరకు వైద్యులు పూర్తిస్థాయిలో చికిత్స అందించే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా, మానసికంగా బలంగా ఉన్నాడని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని