Guterres : ప్రపంచంలో రోజు రోజుకు రక్షణ కరవవుతోంది : ఐరాస చీఫ్‌ హెచ్చరిక

ప్రపంచంలో రోజు రోజుకు రక్షణ కరవవుతోందని ఐక్యరాజ్యసమితి (United Nations) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు.

Published : 26 Feb 2024 19:38 IST

జెనీవా: ప్రపంచ శాంతికి పునాది వంటి మానవ హక్కులపై ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి (United Nations) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగో, గాజా, మయన్మార్‌, ఉక్రెయిన్‌, సుడాన్‌ వంటి ప్రాంతాల్లో కొనసాగుతోన్న పోరాటాలు అంతర్జాతీయ చట్టానికి ‘గుడ్డి కన్ను’గా మారుతున్నాయన్నారు. ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో మాట్లాడిన ఆయన (Antonio Guterres).. ప్రపంచంలో రోజురోజుకు రక్షణ కరవవుతోందని హెచ్చరించారు. మానవ హక్కులకు, ప్రపంచ శాంతికి అత్యంత గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

‘మన ప్రపంచం అత్యంత వేగంగా మార్పు చెందుతోంది. అనేక సంఘర్షణలు ఊహించని వేదనకు దారితీస్తున్నాయి. కానీ, మానవ హక్కులు మాత్రం తటస్థంగా ఉండిపోయాయి. రోజు రోజుకు ప్రపంచంలో రక్షణ కరవవుతోంది’ అని ఐరాస చీఫ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. మానవ హక్కులు శాంతికి పునాది వంటివని, ప్రస్తుతం వాటిపై ఎన్నో రకాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు.

గాజాలో ఉన్న పాలస్తీనా శరణార్థి శిబిరాన్ని (UNRWA) తొలగించాలని ఇజ్రాయెల్‌ పేర్కొనడాన్ని వ్యతిరేకించిన గుటెరస్‌.. అక్కడ సహాయ కార్యక్రమాలకు అది వెన్నెముక వంటిదన్నారు. మరోవైపు అసత్య ప్రచారాలకు ఐరాస ఓ మెరుపు తీగలా, విధాన వైఫల్యాలకు బలిపశువుగా మారిందని ఐరాస మానవ హక్కుల చీఫ్‌ వోల్కర్‌ తుర్క్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని