Kabul attack: కాబుల్‌ విమానాశ్రయ పేలుళ్ల నిందితుడిపై ₹75 కోట్ల రివార్డు

కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లకు కారణమైన ఐఎస్ఐఎస్‌-ఖొరాసన్‌ నేత ఆచూకీ తెలిపిన వారికి అమెరికా భారీ నజరానా ప్రకటించింది.......

Published : 09 Feb 2022 20:15 IST

ప్రకటించిన అమెరికా

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గతేడాది బాంబు పేలుళ్లకు కారణమైన ఐఎస్ఐఎస్‌-ఖొరాసన్‌ నేత ఆచూకీ తెలిపిన వారికి అమెరికా భారీ నజరానా ప్రకటించింది. ఈ దాడిలో ప్రధాన సూత్రధారి అయిన సనావుల్లా గఫారీ ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.75 కోట్లు) ఇస్తామని అమెరికా రివార్డ్​ ఫర్​ జస్టిస్ (ఆర్​ఎఫ్‌జే) విభాగం తెలిపింది. వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని తెలియజేయవచ్చని రివార్డ్ ఫర్ జస్టిస్​ ఓ ట్వీట్​ చేసింది. ఆ ట్వీట్‌కు గఫారీ ఫొటోను కూడా జతచేసింది. అతడిని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు సహకరించండి అంటూ పేర్కొంది.

అఫ్గాన్​లో 20 ఏళ్ల పోరాటానికి గతేడాది ముగింపు పలికిన అమెరికా.. తమ మొత్తం బలగాలను స్వదేశానికి తరలించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత ఆగస్టు 26న కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తంగా 185 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది పౌరులు గాయపడ్డారు. అందులో 18 మంది అమెరికా సిబ్బంది ఉన్నారు. 1994లో అఫ్గాన్‌లో జన్మించిన గఫారీ ప్రస్తుతం ఐఎస్​ఐఎస్​-కె ఉగ్రవాద సంస్థకి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. కాబుల్‌ పేలుళ్లకు తామే కారణమంటూ గతంలోనే ఈ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్​లో జరుపుతున్న ఉగ్ర కార్యక్రమాలకు ఈ సంస్థ నిధులు సమకూర్చుతున్నట్లు ఆర్​ఎఫ్‌జే తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని