The new I2U2 grouping: భారత్‌, ఇజ్రాయెల్‌, యూఏఈ, అమెరికాలతో సరికొత్త గ్రూపు..!

ఇండియా, ఇజ్రాయెల్‌, యూఏఈ, అమెరికాలు కలిసి ఏర్పడిన ఐ2యూ2 గ్రూపు తొలి సారి వర్చ్యూవల్‌గా భేటీ కానుంది.

Published : 16 Jun 2022 02:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండియా, ఇజ్రాయెల్‌, యూఏఈ, అమెరికా కలిసి ఏర్పడిన ఐ2యూ2 గ్రూపు తొలిసారి వర్చువల్‌గా భేటీ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా మిత్ర బృందాల్లో మార్పులు చేసుకొని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగానే బైడెన్‌ కార్యవర్గం సదస్సు నిర్వహిస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నెహ్యాన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెఫ్తాలి బెన్నెట్‌ హాజరుకానున్నారు. ఆహార సంక్షోభం, ఇతర అంశాల్లో సహకారంపై వీరు చర్చించనున్నట్లు సమాచారం.

జులై 13-16 మధ్య జోబైడెన్‌ మధ్యప్రాచ్యంలో పర్యటించనున్నారు. అదే సమయంలో ఈ వర్చువల్‌ భేటీ  జరగనుండటం విశేషం. అధ్యక్షుడు బైడెన్‌ ఈ మూడు దేశాలతో ప్రత్యేక బంధాన్ని కోరుకొంటున్నారని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ మాట్లాడుతూ.. ఈ మూడు దేశాలు టెక్నాలాజికల్‌ హబ్‌లని అభివర్ణించారు. ‘‘భారత్‌ అతిపెద్ద వినియోగదారులు ఉన్న మార్కెట్‌. అంతేకాదు హైటెక్‌ వస్తువులు తయారు చేయగలదు. ఈ దేశాలన్నీ పలు రంగాల్లో కలిసి పనిచేయాల్సి ఉంది. అది టెక్నాలజీ, వాణిజ్యం, వాతావరణం, కొవిడ్‌-19, భద్రతా రంగంలో సమష్టిగా పనిచేయాలి’’ అని పేర్కొన్నారు. 

మధ్యప్రాచ్యం పర్యటనలో భాగంగా జోబైడెన్‌ 50 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టనున్నారు. ఆయన యువ సెనెటర్‌గా ఉన్నప్పుడు ఈ దేశంలో పర్యటించారు. మొత్తం ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్‌, వెస్ట్‌బ్యాంక్‌, సౌదీ అరేబియాల్లో ఆయన ఆగనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని