USA: ‘ఇది ఆరంభం మాత్రమే’.. పశ్చిమాసియాలోని మిలిటెంట్లకు అమెరికా హెచ్చరిక

USA: పశ్చిమాసియాలో ఘర్షణను కోరుకోవడం లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్‌ సలీవన్‌ పునరుద్ఘాటించారు. అయితే, అమెరికన్ల జోలికి వస్తే సహించేది లేదని, మరిన్ని భీకర దాడులు ఉంటాయని హెచ్చరించారు. 

Updated : 05 Feb 2024 08:26 IST

జెరూసలెం: ఇరాక్‌, సిరియాలో తాము ఇటీవల జరిపిన ప్రతీకార దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని అమెరికా (USA) ఆదివారం తెలిపింది. ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు మరిన్ని చర్యలు ఉంటాయని హెచ్చరించింది. శుక్రవారం నాటి దాడులతో ఆ ప్రాంతంలోని మిలిటెంట్‌ గ్రూప్‌ల సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని అగ్రరాజ్య జాతీయ భద్రతా సలహాదారుడు జేక్‌ సలీవన్‌ తెలిపారు.

పశ్చిమాసియాలో ఘర్షణను కోరుకోవడం లేదని సలీవన్‌ పునరుద్ఘాటించారు. అయితే, అమెరికన్ల (USA) జోలికి వస్తే సహించేది లేదని, మరిన్ని భీకర దాడులు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌లోనూ దాడులు జరిపారా? అని అడిగిన ప్రశ్నపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. శుక్రవారం నాటి దాడుల తర్వాత సిరియాలోని అమెరికా స్థావరంపై మరో దాడి జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. ఇరాన్‌ మద్దతుతో సిరియా, ఇరాక్‌లో ఉన్న మిలిటెంట్లు, హూతీల నుంచి భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు ఉండబోవని కచ్చితంగా చెప్పలేమన్నారు. అందుకే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని బైడెన్ తమ సైన్యాన్ని ఆదేశించారని స్పష్టం చేశారు.

క్వాడ్‌పై అమెరికా పునరాలోచనలో పడ్డ వేళ..

జోర్డాన్‌లో ఇటీవల తమ సైనికులు ముగ్గురు మృతి చెందిన ఘటనకు సంబంధించి అమెరికా శుక్రవారం ప్రతీకార దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాక్‌, సిరియాల్లోని ఇరాన్‌ మద్దతుదారులైన మిలిటెంట్లు, రెవల్యూషనరీ గార్డు దళం (IRGC) స్థావరాలపై దీర్ఘశ్రేణి బీ-1 బాంబర్లతో విరుచుకుపడింది. 85కు పైగా శత్రు స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని ఇరాన్‌ చెబుతున్నప్పటికీ.. యూఎస్‌ మాత్రం దాన్ని ఖండిస్తోంది. ఈ దాడులకు బాధ్యత వహించిన ఇరాక్‌లోని ‘ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ గ్రూప్‌’నకు ఐఆర్‌జీసీయే నిధులు సమకూరుస్తోందని.. కావాల్సిన శిక్షణనిస్తోందని ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని