Ukraine Crisis: ఉక్రెయిన్‌లో ఆయుధ కుంభవృష్టి ఇలా..!

పోలాండ్‌లోని ఉక్రెయిన్‌కు సరిహద్దు పల్లెల్లో రాత్రి పగలు తేడా లేకుండా భారీ ట్రక్కుల, భారీ సైనిక కార్గో విమానాల రణగొణధ్వనులు పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌పై దాడికి వచ్చిన రష్యా సైనిక కాన్వాయ్‌లను తుత్తనీయులు

Published : 25 Mar 2022 01:46 IST

 రద్దీగా పోలాండ్‌ సరిహద్దులు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పోలాండ్‌లోని ఉక్రెయిన్‌కు సరిహద్దు పల్లెల్లో రాత్రి పగలు తేడా లేకుండా భారీ ట్రక్కుల, భారీ సైనిక కార్గో విమానాల రణగొణధ్వనులు పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌పై దాడికి వచ్చిన రష్యా సైనిక కాన్వాయ్‌లను తుత్తనీయులు చేసే ఆయుధాలు మొత్తం ఇక్కడి నుంచి అత్యంత రహస్యంగా ఉక్రెయిన్‌లోని కీలక నగరాలకు చేరుతున్నాయి. మూడంచెల విధానంలో వీటిని ఉక్రెయిన్‌ బలగాలకు అందేట్లు నాటో చర్యలు తీసుకొంది. ఎయిర్‌ డిఫెన్స్‌ బ్యాటరీలు, యాంటీ ట్యాంక్‌ మిసైల్స్‌ను నాటో  యద్ధ ప్రాతిపదికన తరలిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం  తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఆయుధ రవాణా ఇదే కావడం విశేషం.

మూడు ప్రమాదకర దశల్లో..

ఉక్రెయిన్‌ రణక్షేత్రంలోని సైనికులకు ఆయుధాలు, ఇంధనం వంటివి సరఫరా చేయడం రక్షణ రంగంలో అత్యంత కీలకమైనది. వాస్తవానికి రష్యా ఇంటెలిజెన్స్‌ కన్నుగప్పి వీటిని తరలించడం కత్తిమీద సాముగా మారింది. కానీ, నాటోదళాలు దీనిని విజయవంతంగా చేస్తున్నాయి. 

తొలిదశలో భాగంగా ఉక్రెయిన్‌కు  అవసరమైన ఆయుధాలను తెలుసుకొని అవి ఐరోపాలోని నాటోదేశాల్లో ఉన్న అమెరికా ఆయుధ గోదాముల్లో ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తారు. ఆ తర్వాత వాటిని తీసి విమానాలు, రైళ్లు, ట్రక్కుల్లో లోడ్‌ చేసి ఉక్రెయిన్‌ సరిహద్దులు ఉన్న పోలాండ్‌, స్లొవేకియా, హంగేరి, రొమేనియాలకు తరలిస్తున్నారు. తొలిదశలో ఈ ఆయుధాలు నాటోదేశాల మీదుగానే ప్రయాణిస్తాయి. ఆయుధ లోడు కదలికలు రష్యాకు ఏమాత్రం అనుమానం రాకుండా పక్కా జాగ్రత్తలు తీసుకొంటారు. అవసరమైతే ఏమార్చే విధంగా రూట్‌మ్యాప్‌ను తయారు చేసుకొంటారు. 

ఈ క్రమంలో ఆయుధ లోడును పలు చోట్లకు మారుస్తారు.. దీనిని స్టేజింగ్‌ ఏరియా అంటారు. ఆయుధ సరఫరాలో ఇవి ఒక్కటే ఉండొచ్చు.. దూరాన్ని పలు నాటో దేశాల్లో స్టేజింగ్‌ ఏరియాలు ఏర్పాటు చేయవచ్చు. సాధారణంగా ఆ దేశంలోని సైనిక స్థావరాలను వీటికి వాడతారు. ఉక్రెయిన్‌లో ఏ ప్రాంతానికి ఆయుధాలు పంపాలి, ఆ మార్గంలోని రోడ్లు, వంతెనల స్థితి, రష్యా దళాల కదలికలు, ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ లోడ్‌కు లభించే భద్రత అన్నదానిని బట్టి ఈ రూట్‌మ్యాప్‌ ఆధారపడి ఉంటుంది.

రెండో దశలో ఆయుధాలు నాటో దేశం నుంచి సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌కు చేరతాయి. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆయుధాలను సరఫరా చేసే బాధ్యత ఉక్రెయిన్‌ప్రభుత్వానిదే. ఇది అత్యంత కఠినమైన దశ. నాటో ఉక్రెయిన్‌పై నోఫ్లై జోన్‌ ప్రకటించకపోవడంతో రష్యా విమానాలు అక్కడి గగనతలంపై ఆధిపత్యం చూపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌ ఈ ఆయుధాలను తరలించేందుకు విమానాలు, హెలికాప్టర్లు వాడలేదు. దీంతో భూమార్గంలో ట్రక్కుల ద్వారా తరలించాలి. భారీ కాన్వాయ్‌లు కనిపిస్తే రష్యా విమానాలు వాటిని ధ్వంసం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఆయుధ లోడ్‌ను విడగొట్టి వేర్వేరుగా పంపిస్తున్నారు. ఈ కాన్వాయ్‌లకు సాయుధ సైనికులు స్టింగర్లు, జావెలిన్‌ వంటి క్షిపణులతో భద్రత కల్పిస్తారు. కాన్వాయ్‌లను వేగంగా పంపేలా రోడ్లను క్లియర్‌ చేయడానికి ప్రత్యేక దళాలు అవసరం. 

ఇక ఉక్రెయిన్‌లోని నగరాలకు చేరిన ఆయుధ లోడ్‌ను చిన్నచిన్న భాగాలుగా మార్చి క్షేత్రస్థాయిలో సైనికులకు అందజేస్తారు. ఇది చివరి దశ. కానీ, ఈ దశలో రష్యా నుంచి ప్రమాదం తీవ్రంగా పొంచి ఉంటుంది. ఆ దేశ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకులు ఆయుధలోడుపై దాడి చేయకుండా పటిష్ఠమైన భద్రత మధ్య వీటిని తరలిస్తారు.

అక్కరకొచ్చిన మిలటరీ గ్రేడ్‌ రన్‌వే..!

ఉక్రెయిన్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని జెస్జో  నగరం ఇప్పుడు ఆయుధ తరలింపులకు కీలకంగా మారింది. ఈ నగరంలో ఉన్న విమానాశ్రయంలో మిలటరీ గ్రేడ్‌ రన్‌వే ఉండటంతో సీ-130 వంటి భారీ విమానాలు దిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ అమెరికాకు చెందిన 82వ ఎయిర్‌బార్న్‌ డివిజన్‌ సైనికులు ఇక్కడ ఆయుధ లోడ్లను వేగంగా దించి తరలించేందుకు పనిచేస్తున్నారు. ఇక టర్కీ వంటి దేశాలు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్లకు దొరకని గల్ఫ్‌స్ట్రీమ్‌ 450 విమానాల ద్వారా ఆయుధాలను పంపిస్తున్నాయి. ఇక్కడ ఉక్రెయిన్‌ ట్రక్కుల్లో వీటిని లోడ్‌ చేసి పంపిస్తున్నారు. రాత్రివేళల్లో గ్రామాల మీదుగా కూడా ఇవి సరిహద్దులు దాటి వెళుతున్నాయి. నాటో బలగాలు ఈ ప్రాంతాలకు జర్నలిస్టులను  వచ్చినా ఇష్టపడటంలేదు. ఇక్కడి రన్‌వేకు ఎటువంటి ముప్పు లేకుండా అమెరికా పేట్రియాట్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను మోహరించింది.

నాటోలోని కొన్ని దేశాలు ఈ స్థాయిలో ఆయుధాల తరలింపు ఇబ్బందికర పరిస్థితి సృష్టించవచ్చని భయపడుతున్నాయి. ఈ ఆయుధాలు చివరికి రష్యన్ల చేతిలో పడే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి. అంతేకాదు.. ఉక్రెయిన్‌ నుంచి బ్లాక్‌మార్కెట్లోకి వెళ్లి ఉగ్రవాదుల చేతిలో పడే ముప్పు ఉన్నట్లు భయపడుతున్నాయి. 

ఉక్రెయిన్‌కు సోవియట్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌..

అమెరికా ప్రభుత్వం గతంలో రహస్యంగా సంపాదించిన సోవియట్‌ కాలం నాటి ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను తాజాగా ఉక్రెయిన్‌కు చేర్చింది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక పేర్కొంది. వాస్తవానికి ప్రత్యర్థి దేశాల ఆయుధ సామర్థ్యాన్ని అంచనావేయడం కోసం అమెరికా సైన్యం, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలు దీనిని సంపాదించాయి. తాజాగా ఉక్రెయిన్‌కు ఎయిర్‌ డిఫెన్స్‌ అవసరం చాలా ఉండటంతో దీనిని పంపింది. అది ఏరకం ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. 1994లో బెలారస్‌ నుంచి అమెరికా ఎస్‌-300 వ్యవస్థను సంపాదించింది. 

గతంలో సోవియట్‌ యూనియన్‌లో భాగమైనా చాలా దేశాలు ఇప్పుడు నాటోలో సభ్యత్వం పొందాయి. ఉక్రెయిన్‌ సేనలకు కూడా సోవియట్‌ వాడిన ఆయుధాల వినియోగంపై పట్టుంది. ఈ నేపథ్యంలో నాటోలోని మాజీ సోవియట్‌ దేశాలైన చెక్‌ రిపబ్లిక్‌, స్లొవేకియా వంటి దేశాలు తమ వద్ద ఉన్న పాత ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించాయి. పోలాండ్‌ ఒక దశలో మిగ్‌-29 విమానాలను కూడా ఇచ్చేందుకు మందుకు వచ్చింది. కానీ, అమెరికా అంగీకరించలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని