Monkeypox: మంకీపాక్స్‌లో మ్యుటేషన్‌పై WHO ఏమన్నదంటే..!

గత రెండున్నరేళ్లుగా కొవిడ్‌ మహమ్మారితో సతమతమవుతోన్న ప్రపంచ దేశాలను తాజాగా మంకీపాక్స్‌ కలవరపెడుతోంది.

Published : 24 May 2022 16:30 IST

ప్రపంచవ్యాప్తంగా వంద దాటిన కేసులు

వాషింగ్టన్‌: గత రెండున్నరేళ్లుగా కొవిడ్‌ మహమ్మారితో సతమతమవుతోన్న ప్రపంచ దేశాలను తాజాగా మంకీపాక్స్‌ కలవరపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 100 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ మ్యుటేషన్‌ చెందిందని చెప్పడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ కేసులు క్రమంగా పెరగడానికి కారణాలేంటనే దానిపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది. వీటి మూలాలు కనుక్కోవడంతోపాటు వైరస్‌లో మార్పులను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 12 దేశాల్లో వెలుగు చూసిన ఈ మంకీపాక్స్‌ కేసులు దాదాపు వందకుపైగా నిర్ధారణ అయ్యాయి. వీటికి అదనంగా పదుల సంఖ్యలో అనుమానిత కేసులు పరీక్షల దశలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు సంక్రమించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌లో ఉత్పరివర్తనాలు సాధారణంగా తక్కువగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర కార్యక్రమంలో భాగమైన స్మాల్‌పాక్స్‌ విభాగాధిపతి రోసామండ్‌ లెవీస్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టడం ద్వారా వైరస్‌ విస్తృతిని అర్థం చేసుకోవచ్చన్నారు. అయితే, మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు ఆఫ్రికా వెలుపల భారీస్థాయిలో వ్యాక్సిన్‌ అవసరమవుతుందని అనుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి పేర్కొన్నారు.

ముప్పు తక్కువే..

పలు దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ దాని వల్ల ముప్పు తక్కువేనని అమెరికా ఆరోగ్య అధికారులు వెల్లడిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరుగుతుందని తెలిసినప్పటికీ వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు మంకీపాక్స్‌ వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా మెలిగిన వారు 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలని బ్రిటిష్‌ ఆరోగ్య రక్షణ సంస్థ సూచించింది.

ఇదిలా ఉంటే, ఆఫ్రికా మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో కనిపించే ఈ వ్యాధి తొలుత అక్కడి నుంచి ఐరోపా, బ్రిటన్‌లకు పాకింది. ఐరోపా, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా దేశాల్లో వందకుపైగా మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కోతుల్లోనే కనిపించే ఈ వైరల్‌ వ్యాధి అంత తేలిగ్గా మనుషుల నుంచి మనుషులకు సంక్రమించదు. వ్యాధి పీడితులకు అత్యంత సన్నిహితంగా వెళ్లిన వారికే త్వరగా సోకుతుంది. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా అది సోకుతుంది. ఇటీవల స్పెయిన్‌, బెల్జియంలలో స్వలింగ సంపర్కుల్లో ఇవి వెలుగు చూశాయి. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి. తాజా వ్యాప్తిలో ఎక్కడా మరణాలు సంభవించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని