Putin: రిషి సునాక్‌ను అభినందించని పుతిన్‌.. ఎందుకంటే..!

బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన రిషి సునాక్‌కు ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కానీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాత్రం బ్రిటన్‌ నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేయలేదు. దీనిపై రష్యా అధ్యక్ష భవనం స్పందించింది.

Published : 27 Oct 2022 01:57 IST

మాస్కో: బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా నియమితులైన రిషి సునాక్‌కు (Rishi Sunak) ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. చిన్న వయసులోనే ప్రధాని బాధ్యతలు చేపట్టిన రిషి.. మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని పలువురు ప్రపంచాధినేతలు ఆకాంక్షించారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) మాత్రం బ్రిటన్‌ నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేయలేదు. దీనిపై రష్యా అధ్యక్ష భవనం స్పందించింది.

‘బ్రిటన్‌ ప్రస్తుతం విరోధి (Unfriendly) దేశాల జాబితాలో ఉంది. అందుకే శుభాకాంక్షలు తెలియజేయలేదు’ అని పుతిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు. అంతకుముందు స్పందించిన పెస్కోవ్‌.. సునాక్‌ నేతృత్వంలో బ్రిటన్‌తో రష్యా సంబంధాలు మెరుగయ్యేందుకు అవకాశాలేమీ కనిపించడం లేదన్నారు. మరోవైపు, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడి పూర్తి మద్దతు ప్రకటించారు.

రిషి సునాక్‌ యూకే పీఎంగా నియమితులు కావడం పట్ల  అమెరికా, భారత్‌, చైనాలు స్పందించిన సంగతి తెలిసిందే. రిషి సునాక్‌కు అభినందనలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచ సమస్యలపై రిషితో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు, రోడ్‌మ్యాప్‌ 2030 అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక సునాక్‌కు అభినందనలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. అమెరికా, భారత్‌, బ్రిటన్‌ వంటి ప్రజాస్వామ్య దేశాల్లోనే ఇలాంటి ఎంపికలకు అవకాశం ఉందని చెప్పారు. బ్రిటన్‌ కొత్త ప్రధాని హయాంలో ఆ దేశంతో సంబంధాలు మరింత ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు చైనా విదేశాంగ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని