PM Modi: యావత్‌ ప్రపంచం సంక్షోభంలోనే..! గ్లోబల్‌ సౌత్‌ సదస్సులో మోదీ

కొంతకాలంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో యావత్‌ ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్లోబల్‌ సౌత్‌ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన.. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సభ్యదేశాలు సంయుక్తంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 

Published : 12 Jan 2023 14:39 IST

దిల్లీ: ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉందని.. ఈ అస్థిరత ఎంతకాలం ఉంటుందనే విషయం అంచనా వేయడం కష్టమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరగడంతోపాటు కొవిడ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలపై పడిన ప్రభావం ఇంకా కొనసాగుతోందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలపైనా ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాయిస్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌ సౌత్‌ సమ్మిట్‌’ (Global South)ను వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన.. 21వ శతాబ్దంలో ప్రపంచ వృద్ధి ఈ దేశాల నుంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘కొత్త శక్తి, సరికొత్త ఆశలతో ఆరంభమైన ఈ నూతన సంవత్సరంలో మనం సమావేశమవుతున్నాం. యుద్ధం, సంఘర్షణ, ఉగ్రవాదం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను చూసిన ఓ ఇబ్బందికరమైన సంవత్సరాన్ని దాటి వచ్చాం. ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరగడం, కొవిడ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలపై పడిన ప్రభావం కొనసాగుతూనే ఉంది. వీటన్నింటినీ చూస్తుంటే ప్రపంచం సంక్షోభ స్థితిలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ అస్థిరత ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం కష్టం’ అని గ్లోబల్‌ సౌత్‌ సదస్సు సభ్యదేశాల ప్రతినిధులనుద్దేశిస్తూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో సవాళ్లను ఎదుర్కొంటూ ఆర్థిక వ్యవస్థలను గాడిలోకి తెచ్చే తేలికైన, సుస్థిర పరిష్కారాలను తక్షణమే గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

‘అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్లు మాత్రం ఈ దేశాలు (Global South) సృష్టించినవి కావు. కానీ, వాటి ప్రభావం మనపైనే ఎక్కువ. అటువంటి పరిస్థితులు, వ్యవస్థలపై ఆధారపడే వలయం నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. మూడోవంతు జనాభా మన దేశాల్లోనే నివసిస్తోంది. మనందరి స్వరం ఒకేవిధంగా ఉండాలి. తద్వారా దశాబ్దాల నాటి పద్ధతుల్లో మార్పులు వస్తాయి. అభివృద్ధి చెందుతోన్న క్రమాన్ని మార్చేందుకు మనం ప్రయత్నించాలి. 21వ శతాబ్దంలో ప్రపంచ వృద్ధి దక్షిణాది దేశాల నుంచే వస్తుంది’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాకు చెందిన దేశాలు ‘గ్లోబల్‌ సౌత్‌ కూటమి’లో సభ్యదేశాలుగా ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న, అల్పాదాయ, ఆర్థికంగా,సాంకేతికంగా వెనుకబడిన దేశాలను గ్లోబల్‌ సౌత్‌గా అభివర్ణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని