Sand: భూమ్మీద ఇసుక ఇక దొరకదా..?

ఇసుక.. ఈ భూమ్మీద నీటి తర్వాత అత్యంత ఎక్కువగా వినియోగించే సహజ వనరు. దీని వాడకానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. అందుకేనేమో.. ఇసుక అక్రమ తవ్వకాలు.. మాఫియా ఇలా ఎన్నో కుంభకోణాలు

Updated : 04 May 2022 05:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇసుక.. ఈ భూమ్మీద నీటి తర్వాత అత్యంత ఎక్కువగా వినియోగించే సహజ వనరు. దీని వాడకానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. అందుకేనేమో.. ఇసుక అక్రమ తవ్వకాలు.. మాఫియా ఇలా ఎన్నో కుంభకోణాలు వెలుగుచూస్తుంటాయి. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా సంగ్రహించే ఘన పదార్థమైన ఇసుక.. నానాటికీ భూమ్మీద కనుమరుగవుతోందట. త్వరలోనే ఈ భూమండలం ‘ఇసుక కొరత’ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశముందట. ఈ మేరకు యునైటెడ్‌ నేషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (యూఎన్‌ఈపీ) హెచ్చరించింది.

‘‘ఇసుక వనరులపై మెరుగైన నియంత్రణ లేకుంటే మన అవసరాలు తీరవు. ప్రస్తుతం మనం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాం. దీనిపై ఇప్పుడు చర్యలు చేపడితేనే ఇసుక సంక్షోభాన్ని తప్పించుకోగలం’’ అని యూఎన్‌ఈపీ ఎకానమీ విభాగ అధిపతి షీలా అగర్వాల్‌ ఖాన్‌ తెలిపారు. వందల, వేల ఏళ్లు భౌగోళిక ప్రక్రియ ద్వారా ఇసుక ఏర్పడుతోందని, అయితే మనం దాని ఆవిర్భావం కంటే వేగంగా ఇసుకను వినియోగించుకుంటున్నామని యూఎస్‌ఈపీ తెలిపింది.

గ్లాస్‌, కాంక్రీట్, భవన నిర్మాణాలు ఇలా అనేక వాటిల్లో ఉపయోగించే ఈ ఇసుక వినియోగం గత రెండు దశాబ్దాలుగా మూడు రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 50 బిలియన్‌ టన్నుల ఇసుకను వినియోగిస్తున్నాం. ఇది నదులు, తీర ప్రాంతాలకు హానికరంగా మారుతుండటమే గాక, చిన్న చిన్న దీవులను తుడిచిపెడుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీని వల్ల పర్యావరణ సంక్షోభం ఏర్పడుతోందని పేర్కొంది. ‘‘పర్యావరణాన్ని నియంత్రించడంలో ఇసుక కీలక పాత్ర పోషిస్తోంది. తుపానుల నుంచి రక్షించడంతో పాటు అనేక  వృక్ష, జంతు జాతులకు ఆవాసంగా మారుతోంది. నియంత్రణ లేని ఇసుక వినియోగం వల్ల పర్యావరణానికి భంగం కలగడంతో పాటు జీవవైవిధ్యంపైనా ఒత్తిడి కలిగిస్తోంది. తీర ప్రాంతాల్లో ఇసుక తగ్గడంతో శక్తిమంతమైన తుపానులు వచ్చే ప్రమాదం ఉంటోంది’’ అని యూఎన్‌ఈపీ వెల్లడించింది.

ఇసుక ఎలా ఏర్పడుతుంది..

ఈ భూమ్మీద ఉండే పెద్ద పెద్ద శిలలు వాతావరణ ప్రభావం వల్ల కాలం గడిచే కొద్దీ అరుగుతూ.. వివిధ పదార్థాలుగా విడిపోతాయి. ఆమ్ల వర్షాల వల్ల రసాయన సంఘటనలు ఏర్పడి ఆ శిలలు ఖనిజాలు, క్వార్ట్జ్‌(సిలికా), పొటాషియం, సోడియం, అల్యూమినియం క్రిస్టల్స్‌గా విడిపోతాయి. అలా ఏర్పడిన సిలికా ఇసుక రేణువులుగా రూపాంతంరం చెందుతుంది. నదులలో నీటీ ప్రవాహం కారణంగా రాళ్లు కొట్టుకొనిపోతూ రాపిడికి గురై రాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఇసుకగా ఏర్పడుతుంది. అందుకే నదులలో, బీచ్‌లలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా మారడానికి వందలు, వేలాది సంవత్సరాలు పడుతుంది. వర్షాభావ ప్రాంతాల్లో ఇసుక గాలితో పాటు లేచి ఒక చోట నిక్షిప్తం కావడంతో ఇసుక దిబ్బలుగా ఏర్పడుతాయి, వీటినే ఎడారులు అంటారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని